IND vs AUS Second T20 Match: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మరింత ఉత్కంఠ బరితంగా మారింది. నాగపూర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీం ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ని 1-1గాసమం చేసింది. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి టీం ఇండియా పగతీర్చుకుంది. దీనితో మూడో మ్యాచ్ నాటికి సిరీస్‌పై ఆశలు మరింత పెరిగాయి. ఇక ఇప్పుడంతా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ ఫలితాన్ని తేల్చే, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచ్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 25న ఆదివారం నాడు జరగనుంది.
నాగపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా గంటలు ఆలస్యమవడంతో 20 ఓవర్ల మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించిన సంగతి విదితమే. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఆసిస్ ఆటగాళ్లు మాథ్యూ వేడ్ అత్యధికంగా 43 పరుగులు (20 బంతుల్లో) చెయ్యగా ఆ తర్వాత ఆరోన్ ఫించ్ 31 పరుగులు (15 బంతుల్లో) చేశాడు. 91 రన్స్ లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. రోహిత్ శర్మ తన అద్భుతమైన ప్రదర్శనతో 46 పరుగులు (20 బంతుల్లో) చేసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర వహించాడు.
ఆరంభంలోనే కేఎల్ రాహుల్, ఆ తర్వాత కొద్దిసేపటికి సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అవ్వడంతో కొంత అభిమానుల్లో నిరాశ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన కొహ్లీ కూడా ఎక్కవ సేపు మైదానంలో ఉండలేకపోయాడు తదనంతరం బరిలో దిగిన రోహిత్ శర్మ మాత్రం నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచి టీం ఇండియా విజయానికి సహాయపడ్డాడు. మరో 5 బంతులకు 3 పరుగులు చేయాల్సి ఉండగానే చివర్లో వచ్చిన దినేశ్ కార్తిక్ స్టైల్‌గా సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా, అక్షర్ పటేల్ బౌలింగ్‌తో కీలకమైన ఆసిస్ వికెట్లు తీసి జట్టు విజయంలో కీ రోల్ పోషించారు. ఇక రేపు జరుగనున్న మూడో టీ20 మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే దానిపైనే అభిమానుల దృష్టి కేంద్రీకృతమై ఉంది.
ఇదీ చదవండి: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. క్రికెట్ లవర్స్ కోసం సెప్టెంబర్ 25న అదనపు రైళ్లు