World Test Champion: ప్రపంచ టెస్టు చాంపియన్‌గా ఆస్ట్రేలియా జట్టు అవతరించింది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేక ఓటమి పాలయింది. 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆసీస్ నిర్దేశించిన 444 పరుగుల ఛేదనలో భారత్ తడబడింది. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి; 2021లో టైటిల్ పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.
మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులతో టీమిండియా ఆటని మొదలు పెట్టింది. కానీ ఆసీస్ బౌలింగ్ ధాటికి నిలువలేకపోయింది. తొలి సెషన్‌లో మరో 70 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. ఇండియా 234 పరుగులకే కుప్పకూలడంతో ఆస్టేలియా 209 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. కోహ్లి, (49) రహానే (46) ఆశించిన మేరకు ఆడకపోగా రవీంద్ర జడేజా,శార్దూల్ ఠాకూర్ పరుగులేమీ చేయలేదు. శ్రీకర్ భరత్ 23, , ఉమేష్ యాదవ్ 1, సిరాజ్ 1 పరుగులు చేసారు.
ఆస్ట్రేలియా ఈ విజయంతో మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న ప్రపంచ క్రికెట్‌లో మొదటి పురుషుల జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆదివారం ఓవల్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌లో భారత్‌ను చిత్తు చేసి ఆస్ట్రేలియా ఈ ఘనతను సాధించింది.ఆస్ట్రేలియా 1987లో మొట్టమొదటి 50 ఓవర్ల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. తరువాత 1999, 2003,2007, 2015లో కూడా దీన్ని రిపీట్ చేసింది. 2006, 2009లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఆస్ట్రేలియా గెలుచుకుంది. 2021లో T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.