Arjun Erigaisi Joins Elite 2800 ELO Club After Anand: యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేసి మరో అరుదైన ఘనత సాధించాడు. చెస్ చరిత్రలోనే దిగ్గజ గ్రాండ్ మాస్టర్‌గా గుర్తింపు పొందిన విశ్వనాథన్ ఆనంద్ పేరుపై ఉన్న ఓ రేర్ రీకార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దేశ చెస్ చరిత్రలోనే విశ్వనాథ్ ఆనంద్ తర్వాత మరెవ్వరికి సాధ్యాం కానీ 2800 ఎలో రేటింగ్‌ను ఈ యంగ్ మాస్టర్ సాధించి సంచలనం సృష్టించాడు. ఆదివారం ఫిడే విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో క్లాసికల్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. 2801 ఎలో రేటింగ్ పాయింట్లు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు.
ఐదుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్ మాత్రమే ఇప్పటివరకు ఈ 2800 ఎలో రేటింగ్‌ను సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అతడి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా, తొలి తెలుగు జీఎంగా తాజాగా అర్జున్ ఈ ఖ్యాతి గడించాడు. ప్రపంచం మొత్తంగా చెస్‌లో ఈ అత్యుత్తమైన ఎలో రేటింగ్‌ను అందుకున్న 16వ గ్రాండ్‌మాస్టర్‌గా అర్జున్ నిలివడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌కు చెందిన 21 ఏళ్ల అర్జున్.. ఈ ఏడాది చెస్ ఒలింపియాడ్‌లో వ్యక్తిగత టీమ్ విభాగాల్లో పసిడి పతకాలు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత సెప్టెంబరులోనే భారత్ నుంచి అత్యధిక రేటింగ్ గల క్రీడాకారుడిగా నిలిచిన అర్జున్ ఈ తాజాగా రికార్డుతో ప్రపంచ రెండో ర్యాంక్‌కు కూడా ఎగబాకాడు.
ఇదిలా ఉంటే గత అక్టోబరులో జరిగిన ఐరోపా క్లబ్ చాంపియన్‌షి్‌పలో అర్జున్ కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన అతడి రేటింగ్ మెరుగవడానికి సహాయపడింది. ప్రస్తుతం నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ 2831 ఎలో రేటింగ్‌తో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత అమెరికా జీఎంలు ఫాబియానో కరువానా 2805 రేటింగ్‌తో రెండవ స్థానంలో, హికారు నకముర 2802 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉన్నారు. అర్జున్ 2801 రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉండగా, అతడి తర్వాత భారత్ నుంచి టాప్-10లో గుకేష్ (2783) ఐదో స్థానంలో విశ్వనాథన్ ఆనంద్ (2750)10వ స్థానంలో ఉన్నారు.