Site icon Prime9

Kukkata Sasthram : ఏపీలో జోరుగా కోడిపందాలు .. కుక్కుట శాస్త్రం గురించి స్పెషల్ స్టోరీ..

special story on kukkata sasthram and kodi pandelu

special story on kukkata sasthram and kodi pandelu

Kukkata Sasthram : సంక్రాంతి అంటే చాలు గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందేలే గుర్తొస్తాయి.

ఓ పక్క ప్రభుత్వం కోడి పందేలు నిషేదం అని చెప్పినా.. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని.. ఎలా వదలుకుంటాం అంటున్నారు పందెం రాయుళ్లు.

దానితో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పందేలు కాస్తుంటే.. మరికొందరు బహిరంగంగానే.. పుంజులను బరుల్లోకి దింపుతున్నారు.

అయితే.. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటే.. కోడి పందేలకు ఓ పంచాంగం ఉంటుందంటా.. మరి ఈ కోడింపందేల పంచాంగం ఏం చెప్తుంది.

కోడి పందేలు నిర్వహించడానికి.. ఏ శాస్త్రాన్ని ఫాలో అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

కుక్కుట శాస్త్రం (Kukkata Sasthram)..

కోడి పందేల నిర్వహణకు ఉపయోగించే పంచాంగాన్ని కుక్కుట శాస్త్రం అంటారు. ఇది కోడి పుంజుల పోరుకు దిశా నిర్దేశం చేస్తుంది.

ఏళ్ల తరబడి కోడి పందేలు నిర్వహించే పలువురు పందెం రాయుళ్లకి ఈ కుక్కటశాస్త్రమే ప్రామాణికం.

పుంజును బరిలో దించడానికి పలువురు పందేల రాయుళ్లు ఈ శాస్తాన్ని నమ్ముతారట.

పందెం కాసే వారు.. వారం, రోజు, తిథి, దిశ, నక్షత్ర బలం వంటి వాటిపైనే.. బరిలోకి దిగిన కోళ్ల.. గెలుపోటములు ఆధారపడి ఉంటాయని వారి నమ్మకం.

బరిలో పోరుకు దిగిన పుంజు గెలుపుకు… దాని పిక్క బలంతో పాటు.. దాని యజమాని పేరు బలం కూడా.. తోడవుతుయాని వారి ప్రగాఢ విశ్వాసం.

అందుకే కోడి పందేల్లో సీనియర్లయిన వారంతా కుక్కుట శాస్త్రాన్ని ఔపోసన పట్టి మరీ.. వారం, తిథి, దిశను బట్టి అందుకు అనుగుణమైన రంగుల పుంజులను బరిలోకి దించుతారు.

రంగులను బట్టి పేర్లు..

కోళ్ల రంగులను బట్టి వాటికి పేర్లను నిర్దారిస్తారు.

నల్లని ఈకలున్న పుంజును కాకి అని, తెల్లని ఈకలుంటే సేతు అని పిలుస్తారు.

మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా గల కోడి పుంజును పర్ల అంటారు.

మెడపై నల్లని ఈకలు గలవాటిని సవలగా పిలుస్తారు. నల్లటి శరీరం, 2, 3 రంగుల ఈకలు గలవి కొక్కిరాయి(కోడి).

ఎర్రటి ఈకలుంటే.. డేగ.. రెక్కలపై, వీపుపై పసుపు రంగు ఈకలుంటే.. నెమలి.. నలుపు, ఎరుపు, పసుపు ఈకలుంటే.. కౌజు అని.. ఎరుపు, బూడిద రంగుల ఈకలున్నవాటిని మైలగా పిలుస్తారు.

ఇలానే పూల, పింగళి, అబ్రాసు, ముంగిస, గేరువా, తెల్లగౌడు, ఎర్రగౌడు వంటి పుంజులు కూడా ఉన్నాయి. ఇవేకాక, వీటితో పాటు కోడి నెమలి, కాకి నెమలి, పచ్చ కాకి వంటి మిశ్రమ రకాలు కూడా ఉన్నాయి.

ఏ రోజు ఏ పుంజులు నెగ్గుతాయంటే..

కోడి పుంజుల్లో కాకి, పచ్చ కాకి, కాకి నెమలి, డేగ ప్రసిద్ధమైనవి. సంక్రాంతి పండగ రోజుల్లో పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారా బలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేసి పందేలు వేస్తారట.

భోగి రోజున గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు, సంక్రాంతి రోజున యాసర కాకి డేగ, కాకి నెమలి, పసిమగల్ల కాకి, కాకి డేగలు గెలుపొందుతాయని అంటారు.

అలాగే కనుమ రోజున డేగ, ఎర్రకాకి డేగలు విజయం సాధిస్తాయని నమ్ముతారు.

నక్షత్ర ప్రభావం మనుషుల మీదే కాకుండా పక్షులు, జంతువుల మీద కూడా ఉంటుందని.. పందెం రాయుళ్లు నమ్ముతారు.

ముఖ్యంగా కోడి పుంజుల్లో.. రక్త ప్రసరణపై గ్రహ ప్రభావం ఉంటుందని పందెం రాయుళ్ల విశ్వాసం.

దానితో, నక్షత్రాన్ని బట్టి ఆయా రంగుల కోడి పుంజులను.. బరిలోకి దించేందుకు.. దాని యజమాని పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి జాతకాన్ని జోడించి లెక్క చూసి మరీ.. పోటీకి దిగుతారు.

27 నక్షత్రాలు, పందెం కోళ్లపై ప్రభావం చూపిస్తాయని, నక్షత్రాలను బట్టి అనుకూలమైన రంగుల కోళ్లను బరిలోకి దించితే గెలుపు ఖాయమని పందెం రాయుళ్ల ప్రగాఢ విశ్వాసం.

‘దిశ’తో దశ తిరుగుతుందా..?

కుక్కుట శాస్త్రం ప్రకారం ‘దిశ’తో దశ తిరుగుతుంది విశ్వసిస్తారు.

ఏ రోజు ఏ దిశలో కోడిపుంజును పందేనికి వదలాలనే దానిపై స్పష్టమైన అంచనా ఉంటుంది.

ఆది, శుక్రవారాల్లో ఉత్తర దిశలో, సోమ, శనివారాల్లో దక్షిణ దిశలో, మంగళవారం తూర్పు దిశలో, బుధ, గురువారం పడమర దిశలో పుంజులను బరిలో దించుతుంటారు.

ఎనిమిది దిక్కుల్లో వారాన్ని బట్టి ఏ దిశలో ఉండే పుంజును బరిలో పోటీకి దించితే విజయం దక్కుతుందో కూడా చూస్తారు.

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల సమయాన్ని అనుసరించి అవస్థా భేదాలను ఎలా లెక్కిస్తుంటారో.. ఇదే తరహాలో పక్షి జాతుల్లో పగటి సమయంలో గల ఐదు జాములకు ఐదు అవస్థలుగా ప్రస్తావించారు.

భోజవావస్థలో కోడి పుంజును బరిలోకి దించితే విజయం దక్కుతుందని, రాజ్యావస్థలో పుంజు సులభంగా గెలుస్తుందని, గమనావస్థలో పందేనికి దించితే సామాన్య లాభం మాత్రమే వస్తుందని, నిద్రావస్థలో అపజయం పాలవుతుందని, జపావస్థలో బరిలోకి దించితే మృతి చెందుతుందని నమ్ముతారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar