Site icon Prime9

Pakistan: కిడ్నాప్ లు.. మతమార్పిడులు.. పాకిస్తాన్‌లో హిందూ మైనారిటీ బాలికలకు రక్షణ కరువు

Pakistan 

Pakistan 

Pakistan: పాకిస్తాన్‌లో మైనారిటీ హిందూ, సిక్కుల బాలికలకు భద్రత లేకుండా పోతోంది. మైనారిటి కూడా తీరని బాలికలను వారి ఇంటి నుంచే బలవంతంగా ఎత్తుకుపోయి.. మతం మార్పిడి చేయించి బాలికలకంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ వయసు ఉన్న వారితో పెళ్లిళ్లు చేయించడం సర్వసాధారణంగా మారిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేడు. తల్లిదండ్రుల ఆవేదన అరణ్య రోదనగా మారిపోతోంది. తాజాగా పాకిస్తాన్‌లో సింధ్‌ ప్రావిన్స్‌లో ఇద్దరు హిందూ బాలికలను అపహరించుకుపోయారని వారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్‌ ముందు నిరసనగా బైఠాయించిన పోలీసులు మాత్రం కేసు రిజిష్టర్‌ చేసుకోవడానికి ససేమిరా అన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో మైనారిటి బాలికల భద్రత ఎలా ఉందో ఈ సంఘటన చూస్తూనే తెలుస్తోంది.

తన ఇద్దరు కుమార్తెల అపరహణ గురించి ఆమె ప్రస్తావించారు. గత వారం సింధ్‌ ప్రావిన్స్‌లోని సుక్కుర్‌ సమీపంలోని సలాహా పాట్‌ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని వివరించారు. తాను తన కుమార్తెలతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు కలిసి తన ఇద్దరు కుమార్తెలను బలవంతంగా ఎత్తుకుపోయారని తెలిపారు. తన పిల్లల వయసు 17 ఏళ్లు, 18 ఏళ్లు అని తెలిపారు. తన కుమార్తెలను రక్షించుకోవడానికి ప్రయత్నించగా.. తనను కొట్టి నెట్టేసి ఎత్తుకు పోయారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నిస్సహాయురాలైన ఆ తల్లి బుధవారం నాడు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు పోలీసులు. దీంతో నిరసనగా స్టేషన్‌ ముందు బైటాయించిన వారి మనసు కరగలేదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి నిరాకరించారు. ముసుగు ధరించిన వ్యక్తి పేరును కూడా పోలీసులకు తెలియజేసినా పోలీసులు మాత్రం అస్సలు పట్టించుకోలేదు. కోర్టును ఆశ్రయించి తన కుమార్తెలను తనకు ఇప్పటించాల్సింది కోరుతానని ఆమె అన్నారు.

పాకిస్తాన్‌లో హిందూ బాలికలను బలవంతంగా ఎత్తుకుపోయి మతం మార్పిడి చేయించి పెళ్లిళ్లు చేయించడం సింధ్‌ ప్రావిన్స్‌లో అతి పెద్ద జాఢ్యంగా మారిపోయింది. సింథ్‌లోని థార్‌ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడి ఉమర్‌ కోట్‌, మీర్‌పూర్‌ ఖాస్‌, గోట్కీ, ఖైర్‌పూర్‌ ప్రాంతాల్లో మైనారిటి హిందూ జనాభా ఎక్కువగా ఉంది. వారిలో చాలా మంది రోజు వారి కూలీలే. అయితే పాకిస్తాన్‌లోని సింధ్‌ గవర్నమెంట్‌ ఇటీవల జరిగన సంఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. సింధ్‌ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌ నగరంలో ఓ 14 ఏళ్ల హిందూ బాలిక అపహరణ జరిగింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం గుడ్డిమెల్ల లాంటింది. గత నెల హిందూ కమ్యూనిటికి చెందిన ఓ మహిళ ఇద్దరు టీనేజ్‌ బాలికలు కిడ్నాప్‌కు గురయ్యారు. వారిలో ఇద్దరు బాలికలతో బలవంతంగా మతం మార్పిడి చేయించారు. ఆ తర్వాత ఇద్దరు ముస్లిం వ్యక్తులతో ఈ ముక్కపచ్చరాలరని బాలికలతో వివాహం చేయించారు. ఇటీవలే సిక్కు మతానికి చెందిన ఓ మహిళ స్థానిక ప్రభుత్వం పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె తలకు తుపాకి గురి పెట్టి అపహరించుకుపోయి .. మతం మార్పిడి చేయించి ఆమె కంటే వయసులో పెద్ద వాడైన ముస్లిం వ్యక్తితో వివాహం చేయించారు. స్థానిక సిక్కులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి రోడ్లపై ధర్నా చేసినా పోలీసులు పట్టించుకోలేదు. భారత్‌ విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ దృష్టికి కూడా ఈ విషయం తీసుకువెళ్లారు ఇండియాలోని సిక్కులు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

రెండేళ్ల క్రితం అంటే జులై 19, 2019లో సింధ్‌ ప్రావెన్స్‌లో పలువురు హిందూ బాలికలను బలవంతంగా అపహరించుకుపోవడం .. అటు తర్వాత వారిని బలవంతంగా మతం మార్పిడి చేయించడం జరిగింది. దీంతో సింధ్‌ అసెంబ్లీలో దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. పలు తీర్మానాలు ప్రవేశపెట్టార. వాటిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కొంత మంది సభ్యులు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ తీర్మానాలు కేవలం హిందూ బాలికలకే వర్తించడం పట్ల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలికలతో బలవంతంగా మతం మార్పిడి చేయించిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలనే తీర్మానాన్ని అసెంబ్లీ ఆ తర్వాత తిరస్కరించింది. ఇలాంటి బిల్లునే గత ఏడాది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆ బిల్లు కూడా తిరస్కారానికి గురైంది.

పాకిస్తాన్‌లో హిందువుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. మైనర్‌ బాలిక కనిపించిందంటే చాలు. ఇరుగు పొరుగు వారే బలవంతంగా ఎత్తుకుపోయి మతం మార్పిడి చేయించి వయసులో పెద్ద వారితో పెళ్లిళ్లు చేయిస్తున్న ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిపై భారత ప్రభుత్వం పాక్‌ ప్రభుత్వంతో మాట్లాడి ఏదైనా పరిష్కారం చూపించాలని బాధితులు ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్నారు. ఆ దిశగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తే అమాయకులైన హిందూ బాలికల జీవితాలను కాపాడిన వారం అవుతామని ఇక్కడి భారతీయుల మనోభావం కూడా ఇదే.

Exit mobile version