క్రిస్మస్ ట్రీ చరిత్ర ఏంటి? జీసస్‌కూ ఈ చెట్టుకు సంబంధం ఏంటి? ఇళ్లలో దీనిని ఎందుకు పెడతారు?

డిసెంబర్ నెల రాగానే ప్రపంచమంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ఇళ్లల్లోనూ క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు ప్రత్యక్షమవుతాయి.

Christmas Tree: డిసెంబర్ నెల రాగానే ప్రపంచమంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ఇళ్లల్లోనూ క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడంటే ఆర్టిఫీషియల్ క్రిస్మస్ ట్రీలు పెడుతున్నారు కానీ.. గతంలో సరివి చెట్ల కొమ్మలు తెచ్చి, దాన్ని క్రిస్మస్ ట్రీలా అలంకరించేవారు. మరి అసలు ఈ క్రిస్మస్ ట్రీ సంప్రదాయం ఎప్పుడు వచ్చింది. క్రిస్మస్ ట్రీకి ఏసుక్రీసుకు ఉన్న సంబంధం ఏంటి.. ఎందుకు క్రిస్మస్ ట్రీని పెట్టుకోవాలో  ఈ కథనం ద్వారా చూసేద్దాం.

క్రిస్మస్ ట్రీని ఇళ్ళు, వ్యాపార సముదాయాలు లేదా చర్చిల్లో పెట్టుకోవడం అనే సంప్రదాయం జర్మనీ దేశంలో మధ్యయుగంలో ఆరంభమైందని చెప్తుంటారు. 15వ శతాబ్ధంలో లివోనియాలో మొట్టమొదటిసారిగా క్రిస్మస్‌ చెట్టును అలంకరించడం అనే సంప్రదాయం మొదలయ్యిందని చెప్తుంటారు. సంస్కరణోద్యమ పితామహుడు మార్టిన్ లూథర్ మొదటగా ఈ చెట్టుకు దీపాలు పెట్టి అలంకరించారు. అప్పటి నుండి క్రిస్మస్ చెట్టును పళ్లు, కానుకలతోనే కాక దీపాలతో కూడా అలంకరిస్తున్నారని సమాచారం.

చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరిసంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని ప్రతి నాగరిక ప్రజలూ గుర్తించారు. చెట్టుకు కూడా ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియదు కాబట్టి ఇవ్వడం, ప్రేమించడం, క్షమించడం అనే ప్రధానాంశాలు ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించుకుంటారు. ఈ విధంగా క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగమైంది. ఇక ఇదిలా ఉంటే క్రిస్మస్‌కు ముందు నుంచే క్రైస్తవులు తమ ఇళ్లపై నక్షత్ర ఆకృతులను అలంకరించుకుంటారు. ఎందుకంటే బైబిల్ ప్రకారం తూర్పు దేశాల వారికి దారి చూపిన దివ్య నక్షత్రాన్ని క్రీస్తు జయంతి సందర్భంగా ప్రత్యేక చిహ్నంగా భావిస్తారు. అందుకుగానూ క్రీస్తు రాకను కాంక్షిస్తూ స్వాగతిస్తూ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, ఇళ్లపై నక్షత్రాన్ని అలంకరించడం ఒక సంప్రదాయంగా నేటికీ కొనసాగుతుంది. ఈ విధంగా క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ ట్రీ మరియు నక్షత్రాలు భాగమయ్యాయి.