Andole: ఆందోల్ నియోజకవర్గంలో ఆ ఇద్దరూ సీనియర్ రాజకీయ నాయకులే. నియోజకవర్గం ఓటర్ల పుణ్యమా అని ఒకరు డిప్యూటీ సీఎం హోదా, మరొకరు మంత్రి హోదాను బాగా ఎంజాయ్ చేసినవారే. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆందోల్ నియోజకవర్గంలో హడావుడి చేసిన దామోదర్ రాజనర్సింహ, బాబుమోహన్. ఇప్పుడు పత్తాలేకుండా పోయారు. గతంలో అందలాన్ని ఎక్కించిన ఓటరు మహాశయుల్ని, వారికోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను మర్చిపోయారు. దీంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డారు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు.
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోల్ ఒకటి. మెదక్ జిల్లాలో ఆందోల్ నియోజకవర్గం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెందిన క్రాంతి కిరణ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ ఓ వెలుగు వెలిగారు. ఇక మరోనేత, సినీ నటుడు బాబుమోహన్ కూడా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. మొదట టీడీపీ, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు ఆయన. దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ సర్కారు హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బాబు మోహన్ టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు.
ఒకప్పుడు ప్రజల్లో మంచి పట్టు ఉండి ఓ వెలుగు వెలిగిన ఈ ఇద్దరు నాయకులు, ఓడిపోయాక ఆందోల్ నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. దీంతో చోటామోటా నాయకులు, కార్యకర్తలు పెద్ద దిక్కు లేకుండా పోయారని మదనపడుతున్నాన్న టాక్ నడుస్తోంది. దామోదర రాజనర్సింహ, బాబూ మోహన్ ఇద్దరూ స్థానికేతరులే. సో, లోకల్ నినాదం ఆ ఇద్దరు నేతల కొంపముంచినట్లు ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. అదే సమయంలో స్థానిక నివాదంతో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నియోజకవర్గంలో క్రమంగా బలపడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. నిత్యం స్థానికుల్లో ఉంటూ తనదైన ముద్రను చూపిస్తున్నారట. టీఆర్‌ఎస్ నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన క్రాంతికిరణ్ అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు ఆందోల్‌లో టీఆర్‌ఎస్ దూకుడుగా ముందుకెళ్తుంటే, మరోవైపు కాంగ్రెస్, బీజేపీలకు పెద్ద దిక్కులేక క్యాడర్, ద్వితీయ శ్రేణి నేతలు గందరగోళంలో పడ్డారని తెలిసింది. దామోదర రాజనర్సింహ, బాబూ మోహన్ నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉండటంలేదని వాపోతున్నారని సమాచారం. నేతల తీరును వారు జీర్ణించుకోలేకపోతున్నారని టాక్. ఆందోల్‌లో చురుకైన కార్యకర్తలు ఉన్నప్పటికీ బీజేపీకి దిశా నిర్దేశం చేసే నాయకుడు లేకపోవడం మైనస్‌గా మారింది. పార్టీని బలోపేతం చేయాలన్న ఉత్సాహం వారిలో ఉన్నప్పటికీ, వారిని ముందుకు తీసుకెళ్లే నాయకుడు లేరట. దీంతో వారు బాబూమోహన్ పై గుర్రుగా ఉన్నారని సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నత పదవులను అనుభవించిన దామోదర్ల రాజనర్సింహ సైతం ఆందోల్ కాంగ్రెస్ క్యాడర్‌కు భరోసాను ఇవ్వలేకపోతున్నారని సమాచారం. స్థానికేతరుడనే ముద్రను చెరిపేసే ప్రయత్నం చేయకపోవడంపై కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. వీరిద్దరికి భిన్నంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వివిధ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తనదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, స్థానికంగా ఉంటున్నా సొంత క్యాడర్‌ను క్రాంతి కిరణ్ ఏర్పాటు చేసుకోలేకపోయారన్న టాక్ లేకపోలేదు.
ఇక ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానం ఆందోల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని ఆ రెండు పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారు. అప్పుడే నియోజకవర్గంలో పార్టీ బలపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరి, ఆ రెండు పార్టీల హైకమాండ్ ఆందోల్ మీద దృష్టి సారిస్తుందా, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.