Priyanka Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పనై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ‘సంకల్ప్ సత్యాగ్రహ’ పేరుతో దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. డిల్లీలోని రాజ్ ఘాట్ లో కాంగ్రెస్ చేపట్టిన దీక్షలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. గాంధీ కుటుంబాన్ని అనేక సార్లు భారతీయ జనతా పార్టీ అవమానించిందని ఆమె తెలిపారు. నెహ్రూ-గాంధీ కుటుంబ నేపథ్యాన్ని బీజేపీ భరించలేకపోతోందన్నారు. ఈ క్రమంలోనే అమరుడి కుమారుడు అంటూ రాహుల్ గాంధీని కించపరుస్తూనే ఉందని చెప్పారు. కానీ, జాతీయ సమైక్యత కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆ అమర ప్రధానమంత్రి కుమారుడు మాత్రం దేశాన్ని ఏరోజు అవమానపరచలేదని ఆమె పేర్కొన్నారు.
బీజేపీ పై ప్రియాంక ఫైర్(Priyanka Gandhi)
‘అమరుడి కుమారుడు, ద్రోహి, మీర్ జాఫర్ అంటూ నా సోదరుడిని ఎన్నో పేర్లతో పిలుస్తున్నారు. బీజేపీ మంత్రులు కూడా మా తల్లిని పార్లమెంటులో అవమానించారు. కొందరు నేతలు మా తల్లిని కించపరుస్తూ మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. నెహ్రూ కుటుంబం పేరును వీళ్లెందుకు ఉపయోగించరంటూ ప్రశ్నించారు. ఇలా ఎన్నో విధాలుగా మమ్మల్ని అవమానపరిచిన వాళ్లపై మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినా మేం మౌనంగానే ఉన్నాం. రెండు ప్రపంచ ప్రతిష్ఠాత్మక సంస్థలైన హార్వార్డ్, కేంబ్రిడ్జి యూనివర్శిటీలో రాహుల్ గాంధీ తన విద్యాభ్యాసం పూర్తి చేశారని, అలాంటి ఆయనను వాళ్లు (బీజేపీ) పప్పూ అని పిలిచారన్నారు.
రాహుల్ గాంధీ వేసే ప్రశ్నలకు భయపడుతోన్న బీజేపీ.. సమాధానం చెప్పలేకే ఆయన్ను వేధిస్తోంది. దేశం కోసం నా కుటుంబం పోరాడింది.. ఈ భూమిలో నా కుటుంబ సభ్యుల రక్తం ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యం నా కుటుంబ రక్తంతో ముడిపడి ఉంది’ అని బీజేపీ తీరుపై ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. ఇటువంటి అహంకారపూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా ఆమె అన్నారు.
ఎలాంటి త్యాగాలైనా చేస్తాం
‘రాహుల్ గాంధీపై మోపిన తప్పుడు కేసులను దేశమంతా గమనిస్తోంది. ప్రజాస్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలి. కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలపై సూరత్‌లో కేసు నమోదు చేసి విచారణల పేరుతో రాహుల్‌ను వేధించారు. రాహుల్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలని బీజేపీ చూస్తోంది. ఆయన గొంతును మూగబోయేలా చేయాలన్నదే వారి కుట్ర. కానీ రాహుల్ ఎవరి కుట్రలకు భయపడరు. శిరస్సు ఖండించినా తలవంచని అలవాటు రాహుల్‌ది. దేశాన్ని, స్వాతంత్ర్యన్ని , ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎలాంటి త్యాగాలు చేయాల్సి వచ్చినా మేము చేస్తాం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.