Pawan Kalyan EG Tour Day2: జగన్ సర్కార్‌ను మరోసారి టార్గెట్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటనతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా గడిపేస్తున్న జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి అన్నదాతల కోసం కదిలివచ్చారు. పవన్ టూర్‌తో రూలింగ్ పార్టీ రాత్రికి రాత్రే అప్రమత్తమైంది. ఓవైపు హడావిడిగా ధాన్యం కొనుగోళ్లు చేపడూ మరోవైపు పవన్ ను ఏవిధంగా ఆపాలి అంటూ వ్యూహరచన చేస్తోందనే చెప్పాలి.
దానితో ప్రతిపక్ష నేతలు వస్తేకాని ధాన్యం కొనుగోలు చేయరా అంటూ అధికార పార్టీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసింటే రైతులకు ఇప్పుడు ఇంత నష్టం జరిగి ఉండేదా అంటూ నిప్పలు చెరిగారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ రైతులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందంటూ అభయమిచ్చారు. రైతన్నల్లు ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి గింజా కొనే వరకూ ప్రభుత్వంపై జనసేన పోరాటం చేస్తుందన్నారు పవన్ కళ్యాణ్. కడియం ఆవ, రాజుపాలెం, కొత్తపేట, ఆవిడిలో రైతులతో నేరుగా మాట్లాడారు. పంటపొలాల్లోకెళ్లి దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.
నేలకొరిగిన పంటను, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పవన్‌కు చూపించి కన్నీళ్లు పెట్టుకున్నారు అన్నదాతలు. అధికారులు ధాన్యం కొనుగోళ్లలోనూ అవకతవకలు చేస్తున్నారంటూ రైతులు పవన్ కు మొరపెట్టుకున్నారు. మరి నేడు కూడా పవన్ కళ్యాణ్ టూర్ కొనసాగనుంది. మరి అధికార పార్టీ పవన్ దెబ్బకు ఇంకెన్ని ఎత్తుగడలు చేస్తుందో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా నేడు జగన్ విశాఖ రానున్నారు. ముఖ్యంగా దేశంలో మొట్టమొదటి బీచ్ రోడ్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన యుద్ధ విమాన ప్రదర్శనశాల సీ హేర్రియర్ మ్యూజియంను ప్రారంభించనున్నారు సీఎం.