Site icon Prime9

Cold War: విశాఖ వైసీపీలో కోల్డ్ వార్

coldwar-in-ycp

Visakhapatnam: విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని ఒకవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మరోవైపు ఇదే ప్రాంతంలోని కీలక నేతలిద్దరి మద్య గొడవలు రోడ్డున పడినట్లు అర్ధమవుతోంది. దాని ఫలితంగా వీళ్ళ గొడవలన్నీ మీడియాకు ఎక్కాయి. వ్యక్తిగత గొడవలతో మీడియాకు ఎక్కితే పోయేది అంతిమంగా పార్టీ పరువే అన్న కనీస ఇంగితం కూడా వీళ్ళకు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉందని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

విశాఖపట్నం నగరంలోని ఖరీదైన భూములను రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరి బంధువులు కారుచౌకగా కొట్టేశారంటు మీడియాలో కథనాలు వస్తున్నాయి. భూ యజమానులకు సాయిరెడ్డి బంధువులకు మధ్య డెవలప్మెంట్ కోసం జరిగిన ఒప్పందం పై మీడియా అనేక కథనాలు ఇచ్చింది. దీనికి సాయిరెడ్డి కౌంటరుగా తాను చెప్పదలచుకున్నదేదో చెప్పారు. తాను కౌంటర్ ఇచ్చిన సమయంలోనే సదరు భూమి డెవలప్మెంట్ కోసం తమ బంధువులు చేసుకున్న ఒప్పందం పూర్తిగా రెండు పార్టీల ఇష్టమని చెబుతునే కూర్మన్నపాలెంలో జరిగిన మరో డెవలప్మెంట్ ఒప్పందాన్ని ప్రస్తావించారు. భూ యజమానులతో ఆ డెవలప్మెంట్ చేసుకున్న బిల్డర్ ఎంవీవీఎస్ మూర్తి. ఆ డెవలపర్ ఎవరయ్యా అంటే బిల్డర్ మాత్రమే కాదు విశాఖ వైసీపీ ఎంపీ కూడా. కావాలనే సాయిరెడ్డి సదరు ఒప్పందాన్ని మీడియాకు ఉప్పందించారనే ప్రచారం పెరిగిపోతోంది. చాలా కాలంగా విశాఖ ఎంపీకి, సాయిరెడ్డికి ఏమాత్రం పడటంలేదనే విషయం ఇపుడు బయటపడింది. వాళ్ళిద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న గొడవల వల్లే సాయిరెడ్డి బంధువులు చేసుకున్న ఒప్పందాన్ని ఎంపీ వైపు నుండి లీకులు వచ్చినట్లు అనుమానంగా ఉంది. ఈ మంటతోనే ఎంపీ కంపెనీ చేసుకున్న ఒప్పందాన్ని విజయసాయిరెడ్డి బయటపెట్టారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

వైసీపీలో జరుగుతున్న ఆధిపత్య పోరాటంలో తనను బలిచ్చేందుకు రెడీ చేస్తున్నారన్న విషయాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి చేసిన భూదందాలు మొత్తం ప్రభుత్వ వర్గాల నుంచే బయటకు వస్తున్నాయట. సొంత పార్టీనేతల ద్వారా విజయసాయిరెడ్డికి చెక్ పెట్టేందుకు తాడేపల్లి నుంచే కొంతమంది గట్టిగా ప్రయత్నిస్తున్నారని టాక్‌. ముఖ్యంగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విజయసాయికి వ్యతిరేకంగా ప్రోత్సహించి ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ లీకయ్యేలా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదంతా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించిన తరవాతే జరుగుతోంది. ఇటీవల విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. ఉత్తరాంధ్ర నుంచి బయటకు పంపేశారు. సోషల్ మీడియా ఇంచార్జ్ పదవిని పీకేశారు. ఆయనను పార్టీ వ్యవహారాల కోసం ఉత్తరాంధ్ర వెళ్లవద్దని స్పష్టం చేశారు. వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు అక్కడ ఇంచార్జ్. అయితే ఒక్క సారిగా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించగానే, ఆయన చేసిన భూదందాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇదంతా అఫీషియల్‌గా బయటకు వస్తున్న సమాచారం కావడంతో విజయసాయిరెడ్డికి మైండ్ బ్లాంక్ అయింది. తాను విశాఖకు దూరం అయితే తనను ఇంకా ముంచేస్తారని భావించిన ఆయన మళ్లీ తాను విశాఖలోనే ఉన్నానంటూ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భూముల గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ అధిష్టానం ఆదేశాలను కాదని ఉత్తరాంధ్రలో పెత్తనం చేయడం మాత్రమే కాదు. మరికొన్ని భూముల డీలింగ్స్ గురించి ప్రస్తావించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపడుతున్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తున్నారు. విజయసాయిరెడ్డికి మద్దతుగా సాక్షి మీడియా ముందుకు రాకపోవడం కూడ ఆయనకు అసంతృప్తిని కలిగించింది. దీనితో తాను న్యూస్‌ చానల్‌, పేపర్‌ పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మొత్తానికి వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్ధాయికి చేరుకున్నట్లు అర్ధమవుతోంది.

 

Exit mobile version