Site icon Prime9

Telangana : తెలంగాణపై బీజేపీ నజర్

Telangana

Telangana

Telangana: గుజరాత్ ఎన్నికలు ముగియడంతో ఇక తమకు కొరకరాని కొయ్యగా మారిన తెలంగాణపై ఫోకస్ చేసేందుకు బీజేపీ రెడీ అయ్యిందట.. ఇక నుంచి బీజేపీ జాతీయ నాయకత్వం దక్షిణాది తెలంగాణపై ఎక్కువ దృష్టి సారించనుంది. ఈ క్రమంలోనే రెండు దక్షిణ భారత రాష్ట్రాలైన కర్ణాటక -తెలంగాణలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. రెండు రాష్ట్రాల్లోనూ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలో బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నాయని హైకమాండ్‌ బలంగా భావిస్తోంది. అధికార టీఆర్ఎస్‌పై గణనీయమైన స్థాయిలో వ్యతిరేకత ఉందని అంచనా వేస్తోంది. అందుకే సరైన అభ్యర్థులను ఎంపిక చేస్తే బీజేపీ సులువైన విజయాన్ని నమోదు చేయగలదని అధిష్టానం వ్యూహరచన చేస్తోంది.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. త్వరలోనే ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఇప్పుడు బీజేపీ నజర్ పెట్టనుంది. ఇందులో కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. షెడ్యూల్ కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఇక కేసీఆర్ రాజకీయాలకు కౌంటర్‌గా బీజేపీ కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం. గత నెలలోనే తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రానున్నార తెలిసింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్‌ వినిపిస్తోంది. నరేంద్రమోదీ, అమిత్‌ షాలు తెలంగాణపైన ఫోకస్ చేసి ఇక్కడ ఖచ్చితంగా విజయం సాధించాలని వ్యూహ రచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభకు ఈ నెల16న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. అయితే రాష్ట్రంలో ముందస్తు ఉహాగానాలు ఊపందుకోవడంతో బండి తన పాదయాత్రను బస్సు యాత్రగా మార్చి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేయాలని చూస్తున్నారు. యాత్రలో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షా ల బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. బండి సంజయ్ బస్సు యాత్రను జంట నగరాలతో పాటు చుట్టూ ఉన్న నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ – కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ దాడిని బీఆర్ఎస్ ప్రకటనతో ముమ్మరం చేశారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో ఏకంగా మోదీ-అమిత్ షాలనే టార్గెట్ చేశారు. దీంతో బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణ రాజకీయాలపై మరింత దృష్టి సారించాల్సిన పరిస్థితి అనివార్యమైంది.

ఒకవైపు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో టీఆర్ఎస్ నాయకత్వాన్ని కట్టడి చేస్తోంది. ఇంకో వైపు రాష్ట్ర ప్రజల్లో బీజేపీకి ఆదరణ లభించేలా రాజకీయ కార్యక్రమాలను విస్తృతం చేయనున్నారు.. పార్టీలోకి వలసలను ప్రోత్సహించడం ద్వారా బీజేపీని పటిష్టం చేసే వ్యూహాలకు పదును పెడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజాక్షేత్రంలో పార్టీని బలపర్చేందుకు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, జాతీయ నాయకుల పర్యటనలు రాష్ట్రంలో ఉదృతం చేయాలని ప్రణాళికలు రచిస్తుంది.తెలంగాణలో గెలుపొందే సత్తాగల అభ్యర్థులను గుర్తించేందుకు బీజేపీ ఐదు వేర్వేరు సర్వేలను నిర్వహించనున్నట్లు సమాచారం. విజయం సాధించాలంటే.. గెలిచే అభ్యర్థుల ఎంపిక ముఖ్యమని పార్టీ భావిస్తోంది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వంటి కొందరు మాజీ ఎమ్మెల్యేలు 2018 ఎన్నికల సమయంలో సర్వేలు చేయాలన్న ఎత్తుగడలను తీవ్రంగా వ్యతిరేకించారని వర్గాలు వెల్లడించాయి. కిషన్ రెడ్డి, రాజాసింగ్ అనే ఇద్దరు నేతలు మాత్రమే గెలుస్తారని హైకమాండ్ భావించింది. రాజా సింగ్ మాత్రమే గెలిచారని కిషన్ రెడ్డి కొద్ది తేడాతో ఓడిపోయారని తేలింది.

ఈసారి సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని జాతీయ నాయకత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సర్వేలు స్వతంత్ర ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నారు. నివేదికలను నేరుగా బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాలకు పంపుతారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి వైఫల్యాలు లేకుండా చూడాలని హైకమాండ్ కోరుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో గెలుపు కోసం ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ స్వయంగా వచ్చి హైప్ తేవడంతోపాటు ముందస్తు ఎన్నికల అంచనాలతో రూట్ మ్యాప్ ను బీజేపీ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ సహా ప్రతీ నియోజకవర్గంలోని ప్రతీ డివిజన్ ఖరారయ్యేలా యాత్రలకు ప్లాన్ చేస్తున్నారు. కేంద్రమంత్రులంతా ప్రతీ నెల తెలంగాణలో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీ అనుబంధ సంఘాలను దించేసి కేసీఆర్‌ను ఓడించడమే పనిగా ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో కాంగ్రెస్ ,టీఆర్ఎస్, బీజేపీల మధ్య మునుముందు పోటా పోటీ రాజకీయాలు సాగడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంమీద కర్ణాటక, తెలంగాణలపై మోదీ, అమిత్‌ షా ఫోకస్ పెట్టనుండటం తెలంగాణ కమలదళంలో ఉత్సాహం రేకెత్తిస్తోంది.

Exit mobile version