Zika Virus: కర్ణాటక చిక్కబళ్లాపూర్ జిల్లాలో ప్రాణాంతక జికా వైరస్‌ను గుర్తించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరోగ్య అధికారులు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ప్రారంభ దశలో సంక్షోభాన్ని తగ్గించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 68 వేర్వేరు ప్రాంతాల్లో దోమల శరీరంలో జికా వైరస్ ఉందో లేదో పరీక్షించామని ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే చిక్కబళ్లాపుర జిల్లాలోని ఆరు ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించారు.సిడ్లఘట్ట తాలూకాలోని తలకాయలబెట్ట గ్రామంలో దోమల్లో జికా వైరస్ కనిపించింది. వెంటనే ఆరోగ్య అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యలను ప్రారంభించారు.
బెంగళూరుకు రక్త నమూనాలు..(Zika virus)
30 మంది గర్భిణులు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఏడుగురి రక్త నమూనాలను సేకరించిన అధికారులు బెంగళూరుకు పరీక్షల నిమిత్తం పంపారు. తలకాయల బెట్ట గ్రామానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల నుంచి నమూనాలు సేకరించారు.వెంకటాపుర, దిబ్బురహళ్లి, బచ్చనహళ్లి, వడ్డహళ్లి తదితర ప్రాంతాల్లో అధికారులు స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. చిక్కబళ్లాపుర జిల్లాలో జికా వైరస్ ఉన్నట్లు చిక్కబళ్లాపుర జిల్లా ఆరోగ్య అధికారి మహేష్‌కుమార్ ధృవీకరించారు.ఈ ప్రాంతంలో సుమారు 5 వేల మందిని ఆరోగ్య అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
జికా వైరస్ అనేది దోమల ద్వారా సంక్రమించే వైరస్. ఇది ప్రధానంగా సోకిన ఈడెస్ దోమల కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. 1947లో మొదటిసారిగా గుర్తించబడిన ఉగాండాలోని జికా ఫారెస్ట్ పేరు మీద ఈ వైరస్ పేరు పెట్టారు.జికా వైరస్ సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే జ్వరం,దద్దుర్లు,తలనొప్పి,కళ్లు ఎర్రబడటం, కండరాల నొప్పి వంటి తేలికపాటి లక్షణాలు కనపడతాయి.