YS Sharmila: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. ఈ ఉదయం బెంగుళూరులో ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆమె అన్నారు. అనంతరం మహానేత వైఎస్సార్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని శివకుమార్ గుర్తు చేశారు.
మా నాన్నకు ఆప్తమిత్రుడు..(YS Sharmila)
ఎన్నికల్లో గెలుపొందిన డీకే శివకుమార్‌ను అభినందించిన వైఎస్ షర్మిల, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారని అన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘డీకే శివకుమార్ మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మా నాన్న, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆప్తమిత్రుడు, నాన్నను స్ఫూర్తిగా తీసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ నాయకత్వం వహించి దాని విజయం వెనుక కీలక నేతగా నిలిచారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు.
ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై షర్మిల అంతకుముందు స్పందిస్తూ మేము ఏ పార్టీతోనైనా చర్చలకు సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, ఆయన పార్టీని అధికారం నుంచి దించడమే మా లక్ష్యం అని స్పష్టం చేసారు. మరోవైపు సీఎం పదవికోసం సిద్దరామయ్యతో పోరాడిన డీకే శివకుమార్ నీటిపారుదల, బెంగళూరు నగరాభివృద్ధి శాఖలను పొందారు.