Ajit Pawar: శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన శాసనసభ్యులందరూ ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు ఏక్నాథ్ షిండే నాయకత్వం వహించినప్పుడు బీజేపీతో చేతులు కలపాలని కోరుకున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. బీజేపీతో జతకట్టాలనే ఉద్దేశ్యాన్ని ధృవీకరిస్తూ ఎమ్మెల్యేలు ఒక లేఖపై సంతకం చేశారని చెప్పారు.
మేమంతా శరద్ పవార్‌ను దీనికి అంగీకరించమని, లేకపోతే మా నియోజకవర్గంలో సమస్యలు తలెత్తుతాయని అడిగాము. బీజేపీతో మాట్లాడేందుకు నేను, అజిత్ పవార్, జయంత్ పాటిల్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మా సీనియర్ (శరద్ పవార్) నన్ను అడగలేదు. ఫోన్‌లో మాట్లాడమని ఆయన చెప్పారు. దీనితో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటు కాలేదని అని అజిత్ పవార్ అన్నారు.2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీతో 5 సార్లు సమావేశాలు నిర్వహించామని, బీజేపీతో పొత్తు ఉండదని, శివసేనతో కలిసి వెళ్తామని అకస్మాత్తుగా తెలియజేశారని చెప్పారు.
నన్ను ఎందుకు విలన్ గా చేస్తున్నారు?.. (Ajit Pawar)
వారు (శరద్ పవార్ శిబిరం) 2017లో శివసేనను కులతత్వ పార్టీ అని పిలిచారు మరియు 2019లో వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అని అజిత్ పవార్ అన్నారు.నన్ను ఎందుకు విలన్‌గా చేస్తున్నారో నాకు తెలియదు.పార్టీని నడిపించేందుకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అజిత్ పవార్ అన్నారు. ఇతర పార్టీల్లో నాయకులు వయసు దాటిన తర్వాత రిటైర్ అవుతారు. బీజేపీ నేతలు 75 ఏళ్లకే పదవీ విరమణ చేశారు. మీరు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల ఉదాహరణను చూడవచ్చు. దీనివల్ల కొత్త తరానికి ఎదుగుదల కలుగుతుంది. మీరు కూడా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వండి.. మేం కొన్ని తప్పులు చేస్తే చెప్పండి.మీ వయసు 83 ఏళ్లు.. మీరిప్పుడైనా ఆపేస్తారా? మాకు ఆశీస్సులు ఇవ్వండని అన్నారు.
అమితాబ్ వయస్సు 82.. అయినా..
ఇదిలా ఉంటే, శరద్ పవార్ వయస్సుపై అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పందిస్తూ అమితాబ్ బచ్చన్ వయస్సు 82, ఇంకా పనిచేస్తున్నారు అని అన్నారు.మమ్మల్ని అగౌరవపరచండి, కానీ మా నాన్నను కాదు. ఈ పోరాటం దేశంలో అత్యంత అవినీతి పార్టీగా ఉన్న బీజేపీ ప్రభుత్వంపై అని సూలే ముంబైలో అన్నారు.