Yogendra Yadav: కేంద్రంలో బీజేపీ అధికారం చేపడుతుంది.. యోగేంద్ర యాదవ్

: లోకసభ ఎన్నికల తర్వాత కేంద్రంలో పగ్గాలు చేపట్టేంది బీజేపీనే అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. అదే కోవలో యోగేంద్ర యాదవ్‌ కూడా కేంద్రంలో బీజేపీనే అధికారం చేపట్టబోతోందన్నారు.

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 01:28 PM IST

Yogendra Yadav: లోకసభ ఎన్నికల తర్వాత కేంద్రంలో పగ్గాలు చేపట్టేంది బీజేపీనే అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. అదే కోవలో యోగేంద్ర యాదవ్‌ కూడా కేంద్రంలో బీజేపీనే అధికారం చేపట్టబోతోందన్నారు. అయితే యాదవ్‌ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ వంద సీట్ల మార్కును దాటుతుందని జోస్యం చెప్పారు. అయితే ప్రశాంత్‌ కిశోర్‌ అంచనాను సోషల్‌ మీడియాలో తప్పుపడుతూ ఆయనను ఎద్దేవా చేసే వారు ఉన్నారు.

ప్రశాంత్‌ కిశోర్‌ అంచనాను యోగేంద్ర యాదవ్‌ సమర్థించారు. బీజేపీ 240 నుంచి 260 సీట్లు సొంతంగా గెలుస్తుందని, మిత్రపక్షాలు 34 నుంచి 45 సీట్లు గెలుస్తుంది. మొత్తానికి చూస్తే ఎన్‌డీఏకు 275 నుంచి 305 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చారు యోగేంద్ర యాదవ్‌. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు సాధిస్తే చాలు. ప్రస్తుతం బీజేపీ/ఎన్‌డీఏకు కలిపి 323 సీట్లున్నాయి. లోకసభలో శివసేనకు 18 సీట్లున్నాయి. అయితే ప్రస్తుతం శివసేన ఎన్‌డీఏ భాగస్వామి కాదు. జూన్‌ 4వ తేదీన వాస్తవాలు తేటతెల్లం అవుతాయని ప్రశాంత్‌ కిశోర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

కాంగ్రెస్ కు 100 సీట్లు..(Yogendra Yadav)

ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే 85 నుంచి 100 సీట్లు సాధిస్తుందని యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే కూటమి బీజేపీ జోరును కాస్తా తగ్గించే అవకాశం ఉంటుంది. సుమారు 120 నుంచి 135 సీట్లు తగ్గిస్తుందని యోగేంద్ర యాదవ్‌ అంచనా వేశారు. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 52 సీట్లు మాత్రమే గెలిచింది. ఈ వారంలో ప్రశాంత్‌ కిశోర్‌ ఓ టెలివిజన్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రంలో బీజేపీ సునాయాసంగా అధికారం చేపడుతుందని.. మరోమారు ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పగ్గాలు చపట్టబోతున్నారని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు.

మోదీ పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇచ్చిన హామీల్లో కొన్ని తీర్చలేదు. అయినా ప్రజల్లో ఆయన పట్ల పెద్దగా వ్యతిరేకతలేదని ప్రశాంత్‌ కిశోర్‌ ఓ జాతీయ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే బీజేపీ 370 సీట్లు సాధించే అవకాశాలు మాత్రమే లేవన్నారు. ఇదిలా ఉండగా అమెరికన్‌ పొలిటికల్‌ సైంటిస్టు ఇయాన్‌ బ్రెమ్మర్‌ మాత్రం బీజేపీ 295 నుంచి 315 సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. 2019లో ఉత్తరాదిన మోదీ వేవ్‌ కొనసాగింది. మరి 370 సీట్లు సాధించాలంటే బీజేపీ తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణలో భారీ ఎత్తున సీట్లు సాధిస్తే.. బీజేపీ అనుకున్న టార్గెట్‌ చేరుకుంటుందని పొలిటికల్‌ పండిట్స్‌ అభిప్రాయపడుతున్నారు.