Wives of Gangsters: ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 15న గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్యల నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ల భార్యలు పరారీలో ఉన్నారు. అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్, అష్రఫ్ భార్య జైనాబ్లు ఇంటికి తాళం కూడా వేయకుండా పరారయ్యారు. అతీఖ్, అష్రఫ్‌ల అంత్యక్రియలకు కూడా షైస్తా పర్వీన్ హాజరుకాకపోవడంతో ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు.
షైస్తా పర్వీన్ పై 50 వేల రూపాయల రివార్డ్..( Wives of Gangsters)
షైస్తా పర్వీన్ తలపై 50 వేల రూపాయల రివార్డ్ కూడా ప్రకటించింది. అతీఖ్ అహ్మద్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో షైస్తా పర్వీన్ కీలకంగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని పోలీసులు చెబుతున్నారు. షైస్తా లొంగిపోతారని వస్తున్న ప్రచారాన్ని అతీఖ్ తరపు న్యాయవాది విజయ్ మిశ్రా తోసిపుచ్చారు. అవన్నీ పుకార్లేనని చెప్పారు. ఇటీవలే షైస్తా బుర్ఖా ధరించకుండా ఓ పెళ్లిలో పాల్గొన్నారంటూ ఫొటోలు వైరల్ అయ్యాయి. గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ మొత్తం 4సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా కూడా గెలిచారు.
తన తమ్ముడు అష్రఫ్‌ను ఓడించాడని బీఎస్పీ అభ్యర్థి రాజు పాల్‌ను 2005లో అతీఖ్ హత్య చేయించాడు. అది కూడా రాజు పాల్‌కు పెళ్లైన 9 రోజులకే. ఇదే ఘటనలో సాక్షిగా ఉన్న ఉమేశ్ యాదవ్ అనే న్యాయవాదిని అతీఖ్ అహ్మద్ ఫిబ్రవరి 24న హత్య చేయించాడు. మొత్తం 10 మంది ఘటనలో పాల్గొనగా యూపీ పోలీసులు అతీఖ్ అహ్మద్ తనయుడు అసద్‌ను, అతడి స్నేహితుడు గులామ్‌ను ఇటీవలే ఎన్‌కౌంటర్ చేశారు. ఉమేశ్ హత్యా ఘటనలో బాంబులు విసిరిన గుడ్డూ ముస్లింతో పాటు ఇతరుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆఫ్షా అన్సారీపై 11 ఎఫ్‌ఐఆర్‌లు..
మరోవైపు గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ భార్య ఆఫ్షా అన్సారీపై కూడా యూపీ పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. ఆమె తలపై ఉన్న రివార్డును ఇటీవలే 50 వేలకు పెంచారు. ఏడాదిగా ఆమె పరారీలో ఉన్నారు. ఆమెపై 11 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. ఒక్క ఘాజీపూర్‌లోనే ఆమెపై 8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆమెపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కూడా నమోదు చేశారు. అటు గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ అనేక కేసుల్లో దోషిగా తేలి ప్రస్తుతం యూపీలో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ బంధువైన ముక్తార్ అన్సారీ గతంలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యూపీలోని మవూ నియోజకవర్గం నుంచి మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అనేక హత్యలు, కిడ్నాప్‌లు, భూ కబ్జాలకు సంబంధించి ముక్తార్ అన్సారీ, ఆయన భార్య ఆఫ్షా అన్సారీపై కేసులున్నాయి.
ఇదిలా ఉండగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో మొత్తం 183 మంది క్రిమినల్స్‌ను పోలీసులు లేపేశారు. 15 వేల మందికి పైగా అరెస్ట్ చేశారు. మాఫియా డాన్‌ల నుంచి వేల కోట్ల ఆస్తులు జప్తు చేశారు. వరుస ఎన్‌కౌంటర్లు, పోలీసుల కఠిన వైఖరితో గ్యాంగ్‌స్టర్ల కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉంటున్నారు. గ్యాంగ్‌స్టర్లైతే ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు పారిపోయి రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఇక యూపీలో మాఫియాకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఇటీవలే సీఎం యోగి ప్రకటించిన విషయం తెలిసిందే.