West Bengal: పంచాయతీ ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. నామినేషన్ సెంటర్ల వద్ద సెక్షన్ 144 సెక్షన్ విధించాలని అధికారులను ఆదేశించింది.
నలుగురు, అంతకు మించి పోలింగ్ సెంటర్ల వద్ద గుమికూడకుండా చర్యలు తీసుకోవాలంటూ అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీసు సూపరిటెండెంట్లకు ఆదేశాలిచ్చింది. పంచాయతీ పోల్స్ నామినేషన్ల పర్వం సోమవారంనాడు తిరిగి ప్రారంభం కాగా, ఎస్‌ఈసీ ఆదివారంనాడు ఈ ఆదేశాలిచ్చింది. ఈనెల 15వ తేదీ వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.కాగా, నామినేషన్ కేంద్రాలకు ఒక కిలోమీటరు పరిధిలోపు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. నామినేషన్ సెంటర్లలోకి ఇద్దరేసి వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. మూడంచెల్లో జరిగే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొదటి రెండు రోజుల్లో 10 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్టు ఆయన చెప్పారు.
కాగా, జూలై 8న పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈస్ట్ బర్దమాన్ జిల్లా అష్‌గ్రామ్‌లో ఆదివారంనాడు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ నేత చంద్రనాథ్ బెనర్జీ తనపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని, తన చేయి విరగ్గొట్టారని ఆరోపించారు. పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇదే తరహా ఘర్షణలు ఈస్ట్ బర్దమాన్ జిల్లా బోర్సులిలో కూడా చోటుచేసుకున్నాయి. సీపీఎం, టీఎంసీ వర్గాల మధ్య కర్రలతో దాడులు జరిగాయి. ఇటుకలతో దాడులు చేసుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులను ఆ ప్రాంతంలో మోహరించారు.
నార్త్ 24 పరగణాలలోని సందేశ్‌కాళి ప్రాంతంలో తమ కార్యాలయాన్ని టీఎంసీ కార్యకర్తలు రాత్రికి రాత్రి ధ్వంసం చేసినట్టు బీజేపీ ఆరోపించింది. తమ కార్యకర్తలు పలువురు గాయపడినట్టు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి హింసాకాండను ఉపేక్షించేది లేదని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ హెచ్చరించారు.