CM Mamata Banerjee :పశ్చిమబెంగాల్ ఎమ్మెల్యేలకు దసరా ఒక నెలరోజులముందే వచ్చినట్లయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం శాసనసభ సభ్యుల జీతాల పెంపును ప్రకటించారు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్‌లో ఎమ్మెల్యేల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ అసమానతను పరిష్కరించడానికి, ఆమె వారి జీతాలను నెలకు రూ.40,000 పెంచుతున్నట్లు ప్రకటించారు.
పెరగిన జీతాలు ఎంతంటే..(CM Mamata Banerjee )
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రకటన చేశారు.ముఖ్యమంత్రిగా తన జీతం మారదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు, ఎందుకంటే తాను చాలా కాలంగా జీతం తీసుకోలేదని తెలిపారు.ఈ పెంపునకు ముందు ఎమ్మెల్యేల జీతం ప్రతినెలా రూ. 81,000 ఉండగా ఇపుడు అది రూ. 1,21,000కి పెరగనుంది. అదేవిధంగా క్యాబినెట్ మంత్రులు అలవెన్సులతో కలిపి మొత్తం రూ.1,09,900 జీతం పొందుతుండగా వారు ఇప్పుడు నెలకు రూ.1,49,900 పొందుతారు. అదేవిధంగా, అలవెన్సులతో కలిపి గతంలో రూ.1,10,000 సంపాదించిన సహాయ మంత్రులు ఇకపై నెలకు రూ.1,50,000 అందుకోనున్నారు.
మరోవైపు ప్రతిపక్షనాయకుడు సువేందు అధికారి ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు, బీజేపీ ఎమ్మెల్యేలు పెంచిన మొత్తాన్ని అంగీకరించరని అన్నారు., ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు పెంచుతోంది. ఐసీడీఎస్ కార్యకర్తలకు డిఎ బకాయిలు మాకు ఇది వద్దని ఆయన అన్నారు.