Site icon Prime9

Madhya Pradesh: ఎనిమిదేళ్లకే కంటిచూపు పోయింది.. కాని మైక్రోసాఫ్ట్ లో రూ.44లక్షల ప్యాకేజీ సాధించాడు.

Yash-Sonakia-mp

Madhya Pradesh: ఇండోర్‌కు చెందిన యష్ సోనాకియా గ్లాకోమావ్యాధి కారణంగా ఎనిమిదేళ్ల వయసులో పూర్తిగా కంటి చూపును కోల్పోయాడు, అయితే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనే అతని కలనుంచి అతడు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ అతనికి దాదాపు రూ.47 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసింది. నగరంలోని శ్రీ జిఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (ఎస్‌జిఎస్‌ఐటిఎస్ నుంచి 2021లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన సోనాకియాకు మైక్రోసాఫ్ట్ నుండి జాబ్ ప్యాకేజీ ఆఫర్ వచ్చింది.

25 ఏళ్ల సోనాకియా ఈ ఆఫర్‌ను అంగీకరించి, త్వరలో ఈ కంపెనీ బెంగళూరు కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరబోతున్నట్లు చెప్పారు. తాను సాధించిన విజయంతో యష్ మీడియా హెడ్ లైన్స్ లోకి ఎక్కాడు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి అతను పడ్డ కష్టం అంతా ఇంతాకాదు. తండ్రి యశ్‌పాల్ సోంకియా పట్టణంలో క్యాంటీన్ నడుపుతున్నాడు. తన కొడుకు పుట్టిన మరుసటి రోజే తనకు పుట్టుకతో వచ్చే గ్లాకోమా వ్యాధి ఉందని తెలిసిందని, దాని కారణంగా అతని కళ్లలో కాంతి చాలా తక్కువగా ఉందని చెప్పాడు. “నా కొడుకు ఎనిమిదేళ్లు వచ్చేసరికి పూర్తిగా కంటిచూపు కోల్పోయాడు, కానీ అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనుకున్నందున మేము అతడిని నిరాశపరచలేదని అన్నాడు. యష్ తండ్రి తన కుమారుడిని ఐదో తరగతి వరకు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం పాఠశాలలో చదివించాడు. అయితే ఆరో తరగతి నుండి సాధారణ పిల్లల పాఠశాలలో చేర్చారు. అతని సోదరి ఒకరు గణితం మరియు సైన్స్‌లో అతనికి సహాయం చేశారు. కొడుకు సాధించిన విజయం పై ఉద్వేగభరితమైన తండ్రి, ‘యష్ నా పెద్ద కొడుకుఎన్నో కష్టాల తర్వాత, ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనే అతని కల ఎట్టకేలకు నెరవేరింది.

యష్ మాట్లాడుతూ ‘ప్రత్యేక టెక్నాలజీ స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్ సహాయంతో బీటెక్ పూర్తి చేసిన తర్వాత, నేను ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాను. కోడింగ్ నేర్చుకుని మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ తర్వాత, నేను మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్ట్‌కి ఎంపికయ్యానంటూ వివరించాడు. యష్ స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్ సహాయంతో మొత్తం కంప్యూటర్‌ను కీబోర్డ్ ద్వారా ఆపరేట్ చేస్తాడు. అతను సులభంగా కోడింగ్ కూడా చేస్తాడు. మైక్రోసాఫ్ట్ నిపుణులు, యష్ సాధారణ వ్యక్తుల మాదిరిగానే సులభంగా మరియు ఖచ్చితంగా కోడింగ్ చేయడం చూసి ఆశ్చర్యపోయారు. మరి యష్ ఉదంతం నేటి యువకులకు ఖచ్చితంగా ఆదర్శప్రాయమనే చెప్పాలి.

Exit mobile version