Viral News : ప్రభుత్వ ఆస్పత్రుల గురించి సాధారణంగా అందరూ చెప్పే మాట ఏంటి అంటే.. ఉన్న రోగాలు తగగడం తర్వాత విషయం కొత్త వాటిని రాకుండా చేస్తే చాలు. ఎందుకంటే ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయి.. ప్రశ్నించే వారు లేరు అనే అహంకారంతో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మనం గమనిస్తే జరిగే విషయం ఒక్కటే.. నిర్లక్ష్యం. సమయానికి అందుబాటులో డాక్టర్లు ఉండరు.. నర్సులు, స్టాఫ్ రోగుల్ని పట్టించుకోరు. తమ ఇష్టారాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. చేతుల్లో లంచం పెట్టనిదే లోపలికి కూడా పంపని చాలా ఘటనలను మనం ఎన్నో గమనించవచ్చు.
సదుపాయాల మాట తర్వాత.. పట్టించుకునే వారే ఉండరు అనే దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారు ప్రభుత్వ హాస్పిటల్స్ ని. కేవలం ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న వాటిని నిత్యం వార్తల్లో చూస్తూ ఉండవచ్చు. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న బాలుడికి.. ఓ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఆక్సిజన్ మాస్క్‌కు బదులు టీ కప్ వినియోగించి వార్తల్లోకి ఎక్కారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని ఉత్తరమేరూర్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దీంతో ఆసుపత్రి సిబ్బంది, అధికారులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
తమిళనాడులోని కాంచీపురం జిల్లా ఉత్తరమేరూరులో ఓ విద్యార్థికి కాస్లులో ఉండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఆ స్కూల్ సిబ్బంది అతడి పేరెంట్స్‌కి సమాచారం అందించారు..హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా..అక్కడ వైద్యులు పిల్లాడిని పరీక్షించి ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టాలని సూచించారు. అయితే, వార్డులో మాస్క్ లేకపోవడంతో టీ కప్పుకు రంధ్రం చేసి ఆక్సిజన్ సిలిండర్ నుంచి ట్యూబ్‌కు కనెక్ట్ చేసి విద్యార్థి చేతికి ఇచ్చి ముక్కుపై పెట్టారు. ఇది చూసిన ఓ రోగి సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో కాస్త ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ దృష్టికి వెళ్లడంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్‌ను విచారణకు ఆదేశించారు. ఈ వీడియోపై నెటిజన్లతోపాటు.. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనై వెంటనే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ వివరణ ఇచ్చారు.