Viral News : జార్ఖండ్ లో దారుణం ఘటన చోటు చేసుకుంది. బైక్ తో గేదెను ఢీ కొట్టాడని ఓ గుంపు యువకుడిని తీవ్రంగా గాయపరిచిన ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ దుండగుల దాడిలో గాయపడిన బాలుడు మృతిచెందడంతో.. బాలుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు కలుగజేసుకొని ఆందోళనను విరమింపజేసి నిందితులకు అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దుమ్కా జిల్లా సంతాలిలోని కుర్మహత్ కు చెందిన బాలుడు ఆదివారం సాయంత్రం ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులతో కలిసి బైక్ పై ఇంటికి వస్తుండగా తాథీ గ్రామం వద్ద అనుకోకుండా గేదెల గుంపులోని గేదెను ఢీకొట్టింది. దాంతో గేదెల మంద వెంట వచ్చిన గుంపునకు, బాలురకు మధ్య వాగ్వాదం జరిగింది. సదరు బాలుడు గేదె యజమానికి నష్టపరిహారం ఇవ్వడానికి కూడా అంగీకరించాడు. కానీ ఆ గుంపు లోని నలుగురు వ్యక్తులు మాత్రం ఆ బాలుడిని చితకబాదారు. భయంతో ఆ బాలుడి వెంట ఉన్న స్నేహితులందరూ అక్కడి నుంచి పారిపోయారు.
విషయాన్ని గమనించిన స్థానికులు తీవ్రగాయాల పాలైన బాలుడిని సమీపంలోని హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి ఆ బాలుడు మరణించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ సమీపంలోని రహదారిని దిగ్బంధించారు. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. బాలుడి మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.