West Bengal violence:పశ్చిమ బెంగాల్‌లో రామనవమి ఊరేగింపుపై ఘర్షణలు సద్దుమణగకముందే హుగ్లీ జిల్లాలో తాజా హింస చెలరేగింది, హౌరా-బుర్ద్వాన్ ప్రధాన డివిజన్‌లో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.
సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో రిష్రా రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేట్‌పై కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబులు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.కొందరు రైల్వే ట్రాక్ గుండా వెళ్లే రైళ్లపై రాళ్లు రువ్వడంతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలోని వాహనాన్ని కూడా తగులబెట్టారు. ఈ తాజా హింస తర్వాత, రైల్వే సేవలు పూర్తిగా నిలిపివేయబడ్డాయి , హౌరా స్టేషన్‌లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.
సాధారణ రైలు సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై రైల్వే అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోయారని ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. ఇంతలో, రిష్రా వద్ద చందర్‌నాగోర్ సిటీ పోలీస్ కమిషనర్ అమిత్ పి. జవల్గి మరియు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బుర్ద్వాన్ రేంజ్) శ్యామ్ సింగ్ నేతృత్వంలో పోలీసుులను ఈ ప్రాంతంలో పెద్దమొత్తంలో మోహరించారు. వీరితో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నారు.హుగ్లీలో తాజా హింస గురించి సమాచారం అందుకున్న పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ డార్జిలింగ్‌లో తన కార్యక్రమాన్నిముగించుకుని కోల్‌కతాకు వెళ్తున్నారు.
ఇలాఉండగా సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది.రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పందిస్తూ.. రిష్రా కాలిపోతోందని, రాష్ట్ర పరిపాలన మొత్తం ‘దిఘ’లో బీచ్ హాలిడేను అనుభవిస్తోందని అన్నారు. “రిష్రా రైల్వే స్టేషన్ సమీపంలో రాళ్ల దాడి మరియు బాంబు దాడి కారణంగా హౌరా-బర్ధమాన్ లైన్‌లో లోకల్ & ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను బలవంతంగా నిలిపివేసారు” అని ఆయన ట్విట్టర్‌లో రాశారు.
హింసాకాండ నేపథ్యంలో హుగ్లీ జిల్లాలోని సెరాంపూర్‌లో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 144 సెక్షన్ విధించారు. ఆదివారం రామనవమి ఊరేగింపు సందర్భంగా రెండు గ్రూపులు ఘర్షణ పడటంతో ఇప్పటికే రిష్రాలో నిషేధాజ్ఞలు విధించారు. ఘర్షణల నేపథ్యంలో హుగ్లీ జిల్లాలో ఏప్రిల్ 2 నుంచి 3 వరకు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.