Uttar Pradesh: ఇంట్లో ఉన్న పాముని తరిమికొట్టడానికి ఒక కుటుంబం చేసిన ప్రయత్నం విషాదాన్ని మిగిల్చింది. పాముకోసం పొగ బెట్టడంతో ఇంట్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో వస్తువులన్నీ బూడిదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఆవు పేడను కాల్చడంతో..(Uttar Pradesh)
ఉత్తరప్రదేశ్‌లోని బండాలో ఉదయం 10 గంటలకు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో నాగుపామును గుర్తించిన ఘటన జరిగింది.పామును తరిమికొట్టే ప్రయత్నంలో, వారు పొగను సృష్టించడానికి ఆవు పేడను కాల్చడం ప్రారంభించారు. అయితే దీని కారణంగా అనూహ్యంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో గది మొత్తం దగ్ధమైంది. దీనితో ఇంట్లో ఉన్న నగదు, నగలు, క్వింటాళ్ల కొద్దీ ధాన్యం బూడిదయ్యాయి.ఢిల్లీలో కూలీగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ తన భార్య, ఐదుగురు పిల్లలతో కలిసి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ కుటుంబం ఇప్పటివరకు చేసిన పొదుపు, ఆస్తులు కలిపి లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రెవెన్యూ శాఖకు కూడా సమాచారం అందించి ప్రస్తుతం జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నారు.