Lok Sabha: లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న వేళభద్రతా వైఫల్యం బయటపడింది. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు ఆగంతకులు టియర్ గ్యాస్ లీక్ చేశారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సంఘటనతో ఎంపీలు భయంతో పరుగులు తీశారు.
పార్లమెంట్‌పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఘటన జరిగడం గమనార్హం. ఈ సంఘటన నేపధ్యంలో పార్లమెంట్ ఆవరణలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీనిపై పూర్తి స్దాయిలో విచారణ జరపాలని స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు. లోక్ సభను కొద్ది సేపు వాయిదా వేసారు. నిందితులు ఎవరనేది తెలియవలసి ఉంది. ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తనను చంపడానికి విఫలమైన హత్య కుట్రకు ప్రతిస్పందనగా డిసెంబర్ 13న కొత్త పార్లమెంటు భవనంపై దాడి చేస్తామని బెదిరించే వీడియోను విడుదల చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ భద్రతా ఉల్లంఘన సంఘటన జరిగింది.
కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో ఒక పోస్ట్‌లో, సంఘటన వివరాలను పంచుకున్నారు. ఇద్దరు యువకులు పార్లమెంట్ గ్యాలరీలో ఉన్న డబ్బాల నుండి పసుపు రంగు వాయువును విడుదల చేయడాన్ని అతను చూశాడు. చొరబాటుదారులను పట్టుకునేందుకు ఎంపీలు దూసుకురాగా, ఒక వ్యక్తి నినాదాలు చేయడం వినిపించింది. ఇలా ఉండగా ఈ సంఘటన కొత్త పార్లమెంట్ భవనం భద్రతపై సందేహాలను లేవనెత్తిందని పలువురు అంటున్నారు.