Chennai Rains: చెన్నై నగరంలో ఆదివారం అర్దరాత్రినుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వేలచేరి, గిండి, వేపేరి, జిఎస్‌టి రోడ్ మరియు కెకె నగర్ వంటి లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. చెన్నై విమానాశ్రయంలో దిగాల్సిన పది విమానాలను సోమవారం తెల్లవారుజామున బెంగళూరు విమానాశ్రయానికి మళ్లించగా, 17 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
చెన్నైతో సహా ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..(Chennai Rains)
మీనంబాకం మరియు నందనంతో సహా చెన్నైలోని ప్రధాన ప్రాంతాలలో ఎనిమిది గంటల వ్యవధిలో 13.7 సెం.మీ మరియు 11.7 సెం.మీ వర్షపాతం నమోదయిందని నివేదికలు సూచిస్తున్నాయి. పొరుగున ఉన్న కాంచీపురం మరియు తిరువళ్లూరు జిల్లాల్లో వరుసగా 7.9 సెం.మీ మరియు 5 సెం.మీ వర్షపాతం నమోదయింది. సెంబియం, కొలత్తూరు, ఎగ్మోర్‌లోని సచివాలయం, మైలాపూర్, గిండీ, టి నగర్‌తో సహా ఎనిమిది ప్రాంతాల్లో కూలిన చెట్లను అగ్నిమాపక శాఖ తొలగించింది.
చెన్నై జిల్లా యంత్రాంగం ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చెంగల్‌పట్టు, వెల్లూరు, తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేట్‌తో సహా పొరుగున ఉన్న జిల్లాల్లో కూడా వర్షం కారణంగా పాఠశాల విద్యార్థులకు సెలవు ప్రకటించారు. అయితే మొత్తం ఆరు జిల్లాల్లో కాలేజీలు తెరిచే అవకాశం ఉంది. పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లాల్లో కూడా ఎలాంటి మార్పులు లేకుండా 12వ తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ డైరెక్టర్ సేతురామ వర్మ ప్రకటించారు.