Jharkhand coal mine collapse: జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోరం చోటు చేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది బొగ్గు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇవాళ ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో భారత్ కోకింగ్‌కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) భౌరా కాలరీ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భౌరా పోలీసుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సింద్రీ డీఎస్సీ అభిశేక్ కుమార్ స్పందించారు.. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
శిధిలాల కింద చిక్కుకున్నారు.. (Jharkhand coal mine collapsed)
గనిలోకి అక్రమంగా మైనింగ్ చేపడుతున్నప్పుడు స్థానిక గ్రామస్థులు అనేకమంది పనుల్లో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులు సత్వరమే స్పందించి ముగ్గురిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చామని, ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించినట్టు తెలిపారు. అయితే ఇప్పటికీ పలువురు శిధిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.