Congress observers: కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయం నమోదు చేసిన తర్వాత, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నియమించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ ఆదివారం ముగ్గురు పరిశీలకులను నియమించింది. ప్రభుత్వ ఏర్పాటు, రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై చర్చించేందుకు బెంగళూరులో కాంగ్రెస్ నేడు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
హైకమాండ్ కు నివేదిక..(Congress observers)
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే, మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్ బవారియా, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి భన్వర్ జితేంద్ర సింగ్‌లను కర్ణాటక పరిశీలకులుగా ఏఐసీసీ నియమించింది. ఇవాళ జరగనున్న కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి పరిశీలకులు హాజరై పార్టీ హైకమాండ్‌కు నివేదిక అందజేయనున్నారు.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ కీలక సమావేశానికి ముందు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఫోన్ చేశారు.2-3 రోజుల్లో ముఖ్యమంత్రిని ప్రకటిస్తామని, వీలైనంత త్వరగా కేబినెట్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నామని కాంగ్రెస్ నేత సయ్యద్ నసీర్ హుస్సేన్ చెప్పారు.
నేటి కాంగ్రెస్ శాసనసభా పక్షం (సిఎల్‌పి) సమావేశంలో, ఒక తీర్మానం ఆమోదించబడుతుంది మరియు ఎమ్మెల్యేలందరూ సిఎం ఎంపికను హైకమాండ్‌కు వదిలివేస్తారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు సీఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికైన వారిని బెంగళూరుకు రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయబడ్డాయి.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల అభిప్రాయం కోరబడుతుంది.అవసరమైతే, వారి నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు వేయమని అడగవచ్చని తెలుస్తోంది.
పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసాను..
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి రేసులో ముందున్న సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసారు. నాకు సిద్ధరామయ్యతో విభేదాలు ఉన్నాయని కొందరు అంటున్నారు, కానీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసి సిద్ధరామయ్యకు అండగా నిలిచాను. సిద్ధరామయ్యకు సహకారం అందించాను అని శివకుమార్ అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ముఖ్యమంత్రి పదవి రేసు వేడెక్కింది. ఈరోజు సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి ముందు ఇరువురు నేతల మద్దతుదారులు పోస్టర్ల వార్‌కు దిగారు.ఆదివారం ఉదయం బెంగళూరులో ఇరువురి నాయకుల అభిమానులు పలు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ అభిమాన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆంకాక్షించారు.