Site icon Prime9

Ahmedabad Schools Bomb Threat: అహ్మదాబాద్‌ స్కూళ్లకు పాకిస్తాన్‌ నుంచే బెదిరింపు ఈ- మెయిల్స్‌

Ahmedabad

Ahmedabad

Ahmedabad Schools Bomb Threat: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలోని పలు స్కూళ్లకు ఈ- మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తీరా స్కూళ్లకు సెలవు ప్రకటించి.. బాంబు కోసం గాలింపు చేపడితే … అది కేవలం బెదరింపు ఈ మెయిల్‌ అని తేలింది. అయితే పోలీసులు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన తర్వాత బెదిరింపు ఈ మెయిల్స్‌ మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు.

పాకిస్తాన్ మిలటరీ కంటోన్మెంట్ నుంచి..(Ahmedabad Schools Bomb Threat:)

మెయిల్‌ పంపిన వ్యక్తి పేరు తోహిక్‌ లియాఖత్‌గా తేలింది. అతను అహ్మద్‌ జావేద్‌ పేరుతో బెదిరింపు మెయిల్‌ పంపాడు. అయితే ఈ బెదిరింపు మెయిల్స్‌ వచ్చినప్పుడు ఇవన్నీ రష్యా డొమైన్‌ నుంచి వచ్చినట్లు అనుమానించారు. ఈ మెయిల్‌ అడ్రస్‌ “tauheedl@mail.ru”.గా గుర్తించారు. అయితే పోలీసు అధికారులు లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ మెయిల్స్‌ పాకిస్తాన్‌లోని మిలిటరీ కంటోన్మెంట్‌ ఏరియా నుంచి వచ్చినట్లు గుర్తించారు.కాగా స్కూళ్లకు పంపిన ఈ మెయిల్స్‌ మాత్రం అమ్మద్‌ జావేద్‌ పేరుతో తోహిక్‌ లియాఖత్‌ మెయిల్స్‌ పంపినట్లు అహ్మదాబాద్‌ క్రైం బ్రాంచి జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు శరద్‌ సింఘాల్‌ చెప్పారు. ఈ నెల 6వ తేదీన గుజరాత్‌లో లోకసభ పోలింగ్‌కు ఒక రోజు ముందు అహ్మదాబాద్‌లో కనీసం 14 స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బెదిరింపులు మెయిల్స్‌ వచ్చిన స్కూళ్లను అణువణువుగా గాలించారు. ఎక్కడ పేలుడు పదార్ధాలు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బెదరింపులు మెయిల్స్‌ వచ్చిన స్కూళ్ల విషయానికి వస్తే ఏషియా స్కూల్‌, ఆనంద్‌ నికేతన్‌, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, హెచ్‌డీకే స్కూల్‌, జెబార్‌స్కూల్‌, కాస్మోస్‌ క్యాసిల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, రెండు కేంద్రీయ విద్యాలయాలున్నాయి.

అయితే కొన్ని స్కూళ్లను ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలుగా మార్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాలు ఆ రోజు ఓటు వేయాల్సి ఉంది. ప్రస్తుతం గాంధీనగర్‌ పార్లమెంటు సభ్యుడు అమిత్‌ షా, మరోసారి ఇక్కడి నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. అయితే గుజరాత్‌కు బెదిరింపు మెయిల్స్‌ పంపడానికి ముందు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. తర్వాత హోంమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో ఇవన్ని ఉత్తుత్తి బెదిరింపు మెయిల్స్‌ అని ప్రకటించడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

Exit mobile version
Skip to toolbar