Karnataka CM: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్త సీఎం ఎంపికలో కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది, ఆ రాష్ట్ర పీసీపీ చీఫ్ డికె శివకుమార్ మరియు సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య ఇద్దరూ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తున్నారు. దీనితో ఎవరిని సీఎం చేయాలనేదానిపై ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతోంది.
సీఎం పదవి పంచుకునేందుకు నో..(Karnataka CM)
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాసేపటి క్రితం బెంగళూరు బయలుదేరి వెళ్ళారు. ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నారు. మాజీ మంత్రి, పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. పార్టీకోసం అహర్నిశలూ కష్టపడ్డానని, తాను చేయాల్సిందంతా చేశానని, ఇక నిర్ణయం అధిష్టానానిదేనని డికె శివకుమార్ చెప్పారు. చెరి రెండున్నరేళ్ళు ముఖ్యమంత్రి పదవి అన్న ప్రతిపాదనకి కూడా డికె శివకుమార్ పరిశీలకులతో ససేమిరా అన్నట్లు తెలిసింది.
ముస్లింలకు కీలకశాఖలు ఇవ్వాలి..
కర్ణాటక ముఖ్యమంత్రిని నిర్ణయించే పనిలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానంపై ఇప్పుడు మిగిలిన పదవులకోసం కూడా ఒత్తిడి మొదలైంది. మంత్రివర్గంలో కీలకమైన హోం, రెవెన్యూ, విద్యా శాఖలు ముస్లింలకి కేటాయించాలని ఆ వర్గంనుంచి డిమాండ్ తెరపైకి వచ్చింది. ముస్లింలకి కీలక మంత్రి పదవులు కేటాయించాలని సున్నీ ఉలేమా బోర్డు తీర్మానం చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవిపై తర్జన భర్జనలు జరుగుతున్న వేళ మంత్రి పదవులకోసం కూడా డిమాండ్లు పెరుగుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
మరోవైపు కాసేపట్లో షిండే కమిటీ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడంతో పాటు.. కేబినేట్ ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇంకో వైపు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లటంపై సస్పెన్స్ నెలకొంది. అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు వార్తలు వస్తున్నా.. ఆయన దానిపై ఇంత వరకూ స్పందించలేదు. సిఎం పదవి విషయంలో డికె శివకుమార్ అధిష్టానం వైఖరిపై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.
https://youtu.be/L-6yfqOHDjU