ఛత్తీస్‌గఢ్: నిండు గర్భిణిని 4 కిలోమీటర్లు మంచంపై మోసుకెళ్ళి ఆసుపత్రికి చేర్చిన భద్రతా బలగాలు

ప్రసవవేదనతో బాధపడుతున్న గిరిజన మహిళను ఆసుపత్రికి చేర్చి భద్రతా బలగాలు మానవత్వాన్ని చాటుకున్నాయి.

  • Written By:
  • Publish Date - December 19, 2022 / 06:15 PM IST

Chhattisgarh: ప్రసవవేదనతో బాధపడుతున్న గిరిజన మహిళను ఆసుపత్రికి చేర్చి భద్రతా బలగాలు మానవత్వాన్ని చాటుకున్నాయి. చత్తీస్ గఢ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సుక్మా జిల్లా కిష్టారం పిఎస్ పరిధిలోనే పాటుకపల్లి గ్రామానికి చెందిన వెట్టి మాయ అనే మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డును నక్సల్స్ ధ్వసం చేయడంతో ఆమెను ఆసుపత్రికి ఎలా తీసుకువెళ్లాలనేది సమస్యగా మారింది. ఈ గ్రామంలో కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) దళాలు యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా మోహరించి ఉన్నాయి.

వెట్టి మాయ భర్త వారి వద్దకు వెళ్లి తన బాధను వెళ్లబోసుకున్నాడు. కోబ్రా డిప్యూటీ కమాండెంట్, మెడికల్ ఆఫీసర్ రాజేష్ పుట్టా, రాజేంద్ర సింగ్‌తో సహా వైద్య బృందం వెంటనే అవసరమైన వైద్య సహాయంతో మహిళ ఇంటికి చేరుకుంది. అక్కడ ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం ఒక మంచంమీద మాయను పడుకోబెట్టి 4 కిలోమీటర్లు మోసుకువెళ్లి అక్కడనుంచి వాహనంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో మాయ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మాయ భర్తతో పాటు గ్రామస్తులందరూ భద్రతాబలగాలకు కృతజ్జతలు తెలిపారు.