Sabarimala Yatra: లోకంలో కొందరు తమకు చేసిన ఉపకారాలను మరచిపోరు. అలాంటి వారిలో ఒకరు అమంగట్టుచలిల్ కన్నన్ . తనకు సాయం చేసిన మనిషికి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అతను శబరిమల యాత్ర ప్రారంభించాడు. అతని ప్రయాణం అంత సులభం కాదు. ఎందుకంటే అతను వికలాంగుడు. దీనితో అతను వీల్ చైర్ లో 300 కిలోమీటర్లు ప్రయాణానికి సిద్దమయ్యాడు.
నిజానికి చాలా ఏళ్ల కిందట కన్నన్‌కు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకోగా, మరో కాలు చచ్చుబడిపోయింది. తాను దినసరి కూలీనని, డిసెంబర్ 3, 2013న లారీ నుంచి దుంగలను దింపుతున్నానని కన్నన్ చెప్పాడు. అదే సమయంలో ప్రమాదంలో కన్నన్ ఎడమ కాలు కోల్పోయాడు. ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్న కన్నన్ తన జీవనోపాధి కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాంటి సమయంలో కొండొట్టిలోని ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, కళాశాలలోని నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ కోఆర్డినేటర్ సమీర సఅతని కోసం ఇల్లు కట్టించారు.’నా జీవితాన్ని మార్చింది సమీరా టీచర్, ఆమె నాకు మరియు నా కుటుంబానికి దేవుడిలాంటిది. నేను అయ్యప్పకు అమితమైన భక్తుడిని. ఈ యాత్ర సమీరా టీచర్ కోసం. నేను శబరిమలలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు కురిపిస్తాడని నేను నమ్ముతున్నాను అంటూ కన్నన్ చెప్పాడు,
డిసెంబర్ 15న కన్నన్ తాడప్పరంబ గ్రామం నుంచి శబరిమలకు బయలుదేరాడు. నేను సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వీల్‌చైర్‌పై ప్రయాణం ప్రారంభిస్తానని, అది మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని అతను చెప్పాడు. శబరిమల యాత్రికుల కోసం దేవాలయాలు లేదా అన్నదానం కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన భోజనం చేసిన తర్వాత, నేను విశ్రాంతి తీసుకుంటాను. ప్రయాణం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. నేను రాత్రులు దేవాలయాలలో గడుపుతానని తెలిపాడు.జనవరి మొదటి వారంలో పంబా నదికి చేరుకుంటానని కన్నన్ చెప్పాడు. కన్నన్ భార్య సతీదేవి ఓ హోటల్‌లో పనిచేస్తోంది. గత నెల నుంచి కన్నన్ లాటరీ టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించాడు. తనకు ఉండటానికి గూడు కల్పించిన మనిషి కోసం తనకు కాళ్లు లేకపోయినా యాత్ర చేయడానికి సిద్దమయిన కన్నన్ అభినందనీయుడని స్దానికులు అంటున్నారు.