Fifth Phase Lok Sabha Polling: దేశవ్యాప్తంగా ఐదవ విడత లోకసభ పోలింగ్ జరుగుతోంది. ముంబైలో పోలింగ్ సందర్బంగా బాలీవుడ్ ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో హ్రితిక్ రోషన్ ఆయన కుటుంబసభ్యులున్నారు. ఓటు వేసి వచ్చిన తర్వాత ఆయన కొంత సేపు మీడియాతో ముచ్చటించారు. ఓటు వేసే ముందు అభ్యర్థి గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఓటు వేయాలని ఆయన ఓటర్లకు సూచించారు. కాగా ఓటు వేసేందుకు హ్రితిక్ తన తండ్రి రాకేశ్ రోషన్, తల్లి పింకీ రోషన్, సోదరి సునయనతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఇన్‌స్టాగ్రాంలో ఓటు వేసిన ఏడమ చేతి వేలు ఫోటోను పోస్ట్ చేశారు.
అలాగే ఓటు వేసిన బాలీవుడ్ ప్రముఖుల్లో యువ హీరో వరుణ్ ధావన్, ఆయన తండ్రి డేవిడ్ ధావన్‌లున్నారు. అలాగే పాటల రచయిత గుల్జార్ ఆయన కూతురుతో కలిసి వచ్చి ఓటు వేశారు.అలాగే దీపికా పదుకొనే, ఆమె భర్త రణవీర్‌సింగ్ కూడా ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. అలాగే విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మీరు ఓటు వేయకపోతే ఫిర్యాదు చేయడానికి అర్హులు కాదని ఆయన అన్నారు. దేశాభివృద్ధి కోసం ఓటు వేశానన్నారు ప్రముఖ డైరెక్టర్ సుభాష్ ఘై. అలాగే అనుపమ్ ఖేర్ కూడా ఓటు వేశారు. ఓటు వేయకపోతే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోతారని అన్నారు. మీ ఓటు ద్వారానే దేశ భవిష్యత్తును నిర్ణయించగలరని బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా చెప్పారు.
ఇక ఐదవ విడత పోలింగ్‌లో పోటీకి నిలబడిన వారి విషయానికి వస్తే రాహుల్‌గాంధీ, బీజేపీ నాయకుడు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూఢీ, పీయూష్ గోయల్, ఉజ్వల్ నికం, కరణ్‌సింగ్ భూషన్ సింగ్, చీరాగ్ పశ్వాన్, ఓమర్ అబ్దుల్లా, ఆర్‌జేడీ నేత రోహిని ఆచార్య పోటీలో నిలబడ్డారు. కాగా ఐదవ విడత పోలింగ్‌లో ఎనిమిది రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది.