Congress CMs: కర్నాటక విజయంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఏకమై మోదీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నాయి. వచ్చే ఏడాది మే నెలలోనే దేశ ప్రజలు కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిఉంటుంది. కర్నాటకలో సీఎం పదవిపై ఇద్దరు ఆశపెట్టుకున్నారు. ఒకరు మాజీ సీఎం సిద్దరామయ్య, మరొకరు పీసీసీ చీఫ్ డికె శివకుమార్. సోమవారం నాడు సిద్దరామయ్య ఢిల్లీ చేరుకుని లాబీయింగ్ మొదలుపెట్టారు. నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా డీకె కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరులోనే గడిపారు. మంగళవారం నాడు ఆయనకూడా ఢిల్లీ వెళ్లారు. పేరుకు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గేనే అయినా తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం రాహుల్‌గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీలే. ప్రస్తుతం జాతీయ వార్తల్లో ప్రధాన అంశంగా కర్నాటక సీఎం పదవి గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయి.
రాజస్తాన్‌లో తలనొప్పి..(Congress CMs)
ఇలాంటి పరిస్థితే రాజస్తాన్‌లో అధిష్టానానికి పెద్ద తలనొప్పి అయ్యి కూర్చుంది. రాజస్తాన్‌లో 2018 ఎన్నికల సమయంలో సచిన్ పైలట్ కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేశారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత సోనియా, రాహుల్‌లు కలిసి సీఎం పదవికి అశోక్ గెహ్లాట్‌ను ఎంపిక చేశారు. అప్పటి నుంచి రాజస్తాన్ కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. పైలట్ 2021లో పార్టీపై తిరుగుబాటు చేశారు. అయితే గెహ్లాట్ వద్ద ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గండి తప్పింది. అటు తర్వాత కాంగ్రెస్ అధిష్టానం అశోక్ గెహ్లాట్‌ను ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ను చేసి సచిన్‌కు సీఎం పదవి అప్పగిద్దామనుకున్నా.. గెహ్లాట్ మాత్రం ససేమిరా అన్నారు. తాను రాష్ట్రానికి సేవ చేస్తానని.. అధిష్టానాన్ని కాళ్ల వేళ్లా పడి ఒప్పించుకున్నారు. రాహుల్ గాంధీ కూడా రంగంలోకి సర్దుబాటు చేద్దామన్నా కాలేదు. సోమవారం నాడు కూడా సచిన్ గెహ్లాత్ కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సచిన్ డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
పంజాబ్ లో స్వయంకృతం..
ఇలాంటి పరిస్థితే పంజాబ్‌లోనూ పునరావృతమైంది. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా క్రికెటర్ నవజ్యోత్ సిద్దూను ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. 2022 ఎన్నికలకు ముందు రాష్ర్ట కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. అప్పుడు పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ ఉన్నారు. ఎన్నికల కంటే ముందు దళితుల ఓట్లు దండుకోవాలనే లక్ష్యంతో దళితుడైన చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిని చేసింది. దీనికి తోడు అమరీందర్‌సింగ్, సిద్దూలు ఒకరిపై ఒకరు విమర్వలు చేసుకోవడంతో పాటు అప్పటికే పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కారణంగా పంజాబ్ ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆప్‌కు పట్టం కట్టారు. చేతిలో ఉన్నమరో రాష్ర్టప్రభుత్వం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ.
మధ్యప్రదేశ్, అస్సాంలో తిరుగుబాటు..
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే తప్పుడు నిర్ణయాలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయి. 2020లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిర్యాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ సీఎం పదవి కమల్ నాథ్‌కు అప్పగించడంతో మనస్తాపంతో ఆయన బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓడిపోయింది. చత్తీస్‌గఢ్ విషయానికి వస్తే పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిని టీఎస్ సింగ్ దేవ్‌కు భూపేశ్ బాగేల్ ఇద్దరు రెండున్నర సంవత్సరాల పాటు ఇస్తామని హామీ ఇచ్చింది. బాగేల్‌ను సీఎం చేశారు. అటు తర్వాత సింగ్ దేవ్‌ను మర్చిపోయారు. అలాగే 2015లో అస్సాంలో హిమాంతా బిస్వాశ్ శర్మ.. సీఎం తరుణ్ గోగోయ్ పై తిరుగుబాటు చేసి నేరుగా బీజేపీలోకి చేరిపోయారు. దీనితో అస్సాం మొత్తం ప్రస్తుతం బీజేపీ చేతిలోకి వచ్చింది. ఇక ఉత్తరాఖండ్ విషయానికి వస్తే హరీశ్ రావత్‌ను సీఎం చేస్తామంటున్నారు. రాహుల్ మాత్రం పార్టీలో యువరక్తాన్ని ఎక్కిస్తామంటున్నారు కానీ వాస్తవానికి చూస్తే మళ్లీ ముసలి వారిని సీఎం చేస్తున్నారు. దీంతో యువ కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి ఏర్పడుతోంది.
ఇక కాంగ్రెస్ పార్టీలో పదవి నుంచి తప్పిస్తే.. ఇతర పార్టీలో చేరుతారు. అదే బీజీపీ విషయానికి వస్తే మంత్రులుగా రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావదేకర్‌ను తప్పించినా.. వారు ఇప్పటికి పార్టీకే సేవ చేస్తున్నారు. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు శశిథరూర్ తరచూ అంటున్నట్లు ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించి .. గాంధీలు దూరంగా ఉంటే సీఎంల ఎంపికలో ఎలాంటి ఇబ్బందులుండవు అంటున్నారు. మరి ఆ దిశలో ఆలోచించే తీరికా ఓపికా కాంగ్రెస్ పార్టీలో కొరవడిందనే బహిరంగ రహస్యమే.