Prime Minister Modi: ప్రపంచ వ్యాప్తంగా పెను భూతంలా విస్తరిస్తున్న ఉగ్రవాదం.. ప్రధాని మోదీ

ప్రపంచ వ్యాప్తంగా పెను భూతంలా విస్తరిస్తున్న ఉగ్రవాదం పై కొన్ని దేశాలు ఉమ్మడి పోరుకు ముందుకు రాకపోవడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జీ - 20 పార్లమెంటరీ సమ్మిట్ ప్రధాని శుక్రవారం ప్రారంభించారు.

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 03:55 PM IST

Prime Minister Modi: ప్రపంచ వ్యాప్తంగా పెను భూతంలా విస్తరిస్తున్న ఉగ్రవాదం పై కొన్ని దేశాలు ఉమ్మడి పోరుకు ముందుకు రాకపోవడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జీ – 20 పార్లమెంటరీ సమ్మిట్ ప్రధాని శుక్రవారం ప్రారంభించారు.

అన్ని దేశాలు కలిసి కట్టుగా రావట్లేదు..(Prime Minister Modi)

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 2001లో పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి ఘటనల్ని గుర్తు చేసుకున్నారు. అటు తర్వాత ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం ఇప్పుడు ఉగ్రవాద సమస్యతో కొట్టుమిట్టాడుతోందన్నారు. అయినా అన్ని దేశాలు కలిసి కట్టుగా టెర్రరిజంపై పోరాడటానికి ముందుకు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కోవడానికి కలిసి పని చేసే విధానంపై అన్ని దేశాల పార్లమెంటుల్లో చర్చ జరగాలని కోరారు. ‘భారత్ దశాబ్దాలుగా ఉగ్రవాద సమస్య ఎదుర్కుంటోంది. టెర్రరిస్టులు వేల సంఖ్యలో అమాయక ప్రజలను హతమారుస్తున్నారు. ఈ సమస్య అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెను సవాలును విసురుతోందని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ.

ఇదిలా ఉండగా అదే సభలో ప్రధాని ఇజ్రాయెల్ – పాలస్థీనాకు మధ్య జరుగుతున్న యుద్ధంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. యుద్ధాలు, సంఘర్షణలు ఎవరికీ ప్రయోజనాలు కల్పించవని.. పైగా తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలు కలిగించి.. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తాయని ప్రధాని అన్నారు. ప్రపంచం ముందున్న సవాళ్లను వదిలేసి కొత్త సమస్యలు తెచ్చుకుంటే అన్ని దేశాలు అంధకారంలోకి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒకే భూమి, ఒకే ప్రపంచం, ఒకే భవిష్యత్తు అనే స్లోగన్ తో ముందుకు సాగాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సవాళ్ల పరిష్కారానికి ప్రజల భాగస్వామ్యమే కీలకమని మోదీ పేర్కొన్నారు.