Tamil Nadu Against NEET: తమిళనాడు రాష్ట్రానికి నీట్ పరీక్షనుంచి మినహాయింపు ఇవ్వాలని , 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులను మెడికల్ కోర్సుల్లో చేర్చుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహించిన నీట్‌కు వ్యతిరేకంగా అధికార డిఎంకె తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తీర్మానాన్ని సమర్పిస్తూ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చెప్పారు.
గ్రామీణ విద్యార్థుల అవకాశాలను దెబ్బతీసింది..(Tamil Nadu Against NEET)
నీట్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మెడిసిన్ చదివే అవకాశాలను దెబ్బతీసిందని, మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు సీట్లు కేటాయించే హక్కును హరించిందని స్టాలిన్ అన్నారు. ‘నీట్‌ను తొలగించాలి. తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలి. మెడిసిన్‌లో చేరేందుకు అవసరమైన అర్హతగా 12వ తరగతి మార్కులను అనుమతిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని స్టాలిన్ డిమాండ్ చేసారు. నీట్‌ను తొలగించడానికి కేంద్రం జాతీయ వైద్య కమిషన్ చట్టానికి అవసరమైన సవరణలు చేయాలన్నారు. చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నీట్‌ను తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. నీట్ అవసరం, కాబట్టి మేము ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వలేము. మేము వాకౌట్ చేయాలని నిర్ణయించుకున్నామని అసెంబ్లీ నుండి వాకౌట్ చేయడానికి ముందు నాగేంద్రన్ అన్నారు.ఎన్టీఏ జూన్ 11న కాకుండా జూన్ 4న నీట్ పరీక్షా ఫలితాలను రహస్యంగా విడుదల చేసిందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ చీఫ్ సెల్వపెరుంతగై పేర్కొన్నారు.సెల్వపెరుంతగై, నాగేంద్రన్‌ల వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అనంతరం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు.