Parliament Session: లోక్‌సభలో గతవారం చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు పట్టు వీడటం లేదు. విపక్షాల నిరసనలతో సోమవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఉభయ సభల్లో కలిపి మొత్తంగా 92మందిపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌధరి సహా 47మందిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
వీరిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఎంపీలు కె. జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీఖ్ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. వీరి ప్రవర్తనపై ప్రివిలేజెస్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నివేదిక వచ్చే వరకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది.
మరోపక్క రాజ్యసభలో కూడా ఇదే తరహా దృశ్యాలు కనిపించాయి. దీంతో 45మంది విపక్ష సభ్యులని సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ సహా పలు పార్టీల విపక్ష నేతలపై ఈ వేటు పడింది. వీరిలో 34 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా.. మరో 11 మందిని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక అందే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ జగదీప్ ధంకర్ వెల్లడించారు. ఇప్పటికే రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్‌పై ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు పడింది. దీంతో నేటి సస్పెన్షన్‌లతో కలిపి ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు మొత్తంగా 90 మందికి పైగా విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు.