Supreme Court: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్‌వీ అశోకన్ క్షమాపణల పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా అశోకన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోర్టుకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. కాగా మంగళవారం నాడు అశోకన్ స్వయంగా జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అమానుల్లా ఖాన్ బెంచ్ ముందు హాజరై క్షమాపణలుకోరారు. అయితే బెంచ్ మాత్రం ఆయన ప్రవర్తనపై అంసతృప్తి వ్యక్తం చేసింది. డాక్టర్ అశోకన్ అనుభవజ్ఞుడైన డాక్టర్. అతను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడని అనుకున్నామని జస్టిస్ హిమా కోహ్లి అన్నారు. ఇక జడ్జి అమానుల్లా ఖాన్ మాత్రం ఐఎంఎ ప్రెసిడెంట్ కూడా పతంజలి వ్యవస్థాపకుల్లాగా వ్యవహరించారని జడ్జి వ్యాఖ్యానించారు.
పతంజలి పట్ల వ్యవహరించినట్లే..(Supreme Court)
పతంజలి పట్ల కోర్టు ఎలా వ్యవహరించిందో డాక్టర్ అశోకన్ పట్ల అలానే వ్యవహరిస్తుందని జస్డిస్ కోహ్లి అన్నారు. పతంజలి క్షమాపణను కోర్టు తిరస్కరించిందని గుర్తు చేశారు. కేసు కోర్టులో ఉన్న సమయంలో మీరు మీడియా ముందుకు ఎలా వెళతారు.. పతంజతి కేసులో మీరు కూడా పార్టీనే అని కోర్టు గుర్తు చేసింది. మీ వ్యవహార శైలి పట్ల కోర్టు సంతృప్తిగా లేదని జడ్జిలు వ్యాఖ్యానించారు. కోర్టుకు వచ్చే ముందు అశోకన్ బహిరంగంగా క్షమాపణలు ఎందుకు చెప్పలేదని కోర్టు ఆయనను ప్రశ్నించింది. దీనికి అశోకన్ సమాధానమిస్తూ.. సుప్రీంకోర్టు అంటే తనకు అత్యంత గౌరవమని అన్నారు. ఐఎంఏ తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ పీఎస్ పట్‌వాలియాతో జడ్జిలు మాట్లాడుతూ.. ఈ స్థితిలో మీ క్లయింట్ క్షమాపణలు అంగీకరించే పరిస్థితిలో లేమని అన్నారు.
ఇక అసలు విషయానికి వస్తే పతంజలి ఆయుర్వేద ప్రజలను తప్పుదోవ పట్టించే పత్రికా ప్రకటనలు ఇస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అల్లోపతి మెడిసిన్ కంటే తమ ఆయుర్వేద మందులు బాగా పనిచేస్తాయని ప్రకటనలతో హోరెత్తించాయి. దీనిపై కోర్టు పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణను పిలిచి దీనికి సంబంధించి శాస్ర్తీయంగా జరిపిన పరిశోధనల గురించి నిలదీసింది. దీంతో బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ కోర్టుకు క్షమాపణలు చెప్పారు. అయినా కోర్టుకు హాజరైన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వడం పట్ల కోర్టు రాందేవ్, బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. వారి క్షమాపణలను కూడా కోర్టు ఆమోదించలేదు.
కోర్టు ధిక్కారనేరంపై..
అయితే గత నెల కోర్టు ఐఎంఏ ప్రెసిడెంట్‌పై ఈ కేసుకు సంబంధించి దృష్టి పెట్టింది. ఒకరిపై ఫిర్యాదు చేసే ముందు మీరు మీ ఇంటిని ఆర్డర్‌లో పెట్టుకోవాలని చురకలంటించింది. కోర్టులో కేసు ఉన్న సమయంలో అశోకన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన సుప్రీంకోర్టుపై కొన్ని వ్యాఖ్యాలు చేశారు. దీన్ని పతంజలి తమకు అనుకూలంగా మలచుకుంది. డాక్టర్ అశోకన్‌కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశారు. ఐఎంఏ ప్రెసిడెంట్ కూడా కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డారని పతంజలి అశోకన్‌పై కేసు వేసింది. దీంతో కోర్టు ఐఎంఏ ప్రెసిడెంట్ అశోకన్‌కు నోటీసు జారీ చేసింది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణలు చెప్పారు. అయితే ఈ క్షమాపణలను కోర్టు అంగీకరించలేదు.