State Bank Of India: చలామణి నుంచి రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఊహాగానాలపై స్పషత(State Bank Of India)
అయితే రూ. 2 వేల నోటు రద్దు ప్రకటన చేసినప్పటి నుంచి ప్రజలల్లో అనేక సందేహాలు తలెత్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నోట్ల మార్పిడి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నోట్లను మార్చుకునేటపుడు ఒక ఫారం నింపాలనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే విధంగా మార్పిడి కి ఏదైనా గుర్తింపు కార్డును కూడా సమర్పించాలని అంటున్నారు. దీంతో చక్కర్లు కొడుతున్న వార్తలపై ప్రభుత్వం బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ స్పందించింది. ఊహాగానాలపై స్పషత ఇచ్చింది.
ఎలాంటి ఫారమ్ అవసరం లేదు
బ్యాంకుల్లో రూ. 2,000 నోట్ల మార్పిడికి ఎలాంటి ఫారం నింపాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. రోజుకు రూ. 20 వేల వరకు బ్యాంకులో నేరుగా మార్చుకోవచ్చని తెలిపింది. అలాగే ఎటువంటి ఐడీ ప్రూఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. నోట్ల మార్చుకునే సమయంలో రిక్విజేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుందని.. దానికి ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డుల జత చేయాలని సోషల్ మీడియాలో పలు సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్‌బీఐ ఆ వార్తలపై స్పష్టతనిచ్చింది. ఈ మేరకు అన్ని బ్యాంకు శాఖలకు ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్బీఐ నిబంధనలివే
రూ. 2 వేల నోట్లు కలిగి ఉన్నవాళ్లు ఈ నెల 23 నుంచి సెప్టెంబరు 30 లోపల మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. దేశంలో ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2 వేల నోట్లు మార్చుకునే వీలు కల్పిస్తున్నట్టు పేర్కొంది. 2016 నోట్ల రద్దు సందర్భంగా రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ చలామణిలోకి తీసుకువచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్బీఐ స్పష్టం చేసింది.
అదే విధంగా ఒక విడతలో రూ. 20 వేల చొప్పున మాత్రమే 2 వేల నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే డిపాజిట్ విషయంలో ఎలాంటి నిబంధనలను ఆర్బీఐ విధించలేదు. బ్యాంకులకు సంబంధించి రోజు వారీ విధులకు ఆటంకాలు కలగకుండా నోట్ల మార్పిడి ప్రక్రియన చేపట్టాలని ఆర్బీఐ సూచించింది.