Manipur Telugu students: మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తరలించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాయి. మణిపూర్ ప్రభుత్వంతో ఏపీ, తెలంగాణ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ఇంఫాల్ నిట్‌లో చిక్కుకున్న విద్యార్థులను త్వరగా తీసుకురావాలని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
మణిపూర్‌లో నెలకొన్న శాంతిభద్రతల సమస్యతో అక్కడ ఉన్న తెలంగాణ విద్యార్థులు, నివసిస్తున్న ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మణిపూర్‌లోని తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ తెరిచారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్‌తోపాటు పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. తెలంగాణ విద్యార్థులను ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు తక్షణమే ప్రత్యేక విమానంలో తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేటి సాయంత్రం 6:30కి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానం చేరుకోనుంది.
మణిపూర్‌లో హింసాత్మక అల్లర్లు కారణంగా అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తరలింపునకు ఏపీ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దిల్లీలోని ఏపీ భవన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన అధికారులు… ప్రత్యేక విమానం ద్వారా విద్యార్థులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. ప్రత్యేక విమానం ద్వారా విద్యార్థుల తరలింపునకు సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతి తెలిపింది. దాదాపు 100 మందికి పైగా ఏపీ విద్యార్థులు మణిపూర్‌లో చదువుతున్నట్టు అధికారులు గుర్తించారు.