Site icon Prime9

Sourav Ganguly: సౌరభ్ గంగూలీకి కొత్త బాధ్యతలు.. తెరపైకి మళ్లీ ఆ చర్చ

Sourav Ganguly

Sourav Ganguly

Sourav Ganguly: భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఈశాన్య రాష్ట్రం త్రిపుర పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా ప్రకటించారు.

 

త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌధరీ మంగళవారం కోల్ కతాలోని గంగూలీ ఇంటికి వెళ్లారు. అటు సీఎం మాణిక్‌ సాహా కూడా గంగూలీతో ఫోన్‌లో మాట్లాడి బ్రాండ్ అంబాసిడర్‌ బాధ్యతలను చేపట్టాల్సిందిగా కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ టూరిజం అంబాసిడర్ గా నియమిస్తున్నట్టు తిప్రుర ప్రభుత్వం ప్రకటించింది. ‘టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ మా ప్రతిపాదనను అంగీకరించి త్రిపుర టూరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాధ్యతలు తీసుకోనుండటం మాకు గర్వకారణం. ఆయన రాకతో మా రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊపునిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను’అని ముఖ్యమంత్రి సాహా ట్విటర్‌లో పోస్టు చేశారు.

 

 

ఆయన కంటే ఆదరణ ఎవరికి (Sourav Ganguly)

త్రిపుర రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి సుశాంత చౌదరి తెలిపారు. తమ రాష్ట్ర పర్యాటకాన్ని ప్రచారం చేయడానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దాదా సౌరభ్ గంగూలీ కంటే ఎక్కువ ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరుంటారు? అని ఆయన పేర్కొన్నారు.

 

మరోసారి ఊహాగానాలు

అయితే, తాజా నిర్ణయంతో గంగూలీ రాజకీయ అరంగేట్రంపై మరోసారి చర్చ మొదలైంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న త్రిపుర పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టడంతో.. వెస్ట్ బెంగాల్ లోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీంతో గంగూలీ బీజేపీలో చేరుతారని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.

 

Exit mobile version