Wrestling Federation of India: డబ్ల్యుఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏడాది ప్రారంభంలో అనేక వాయిదాల తర్వాత, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు గురువారం డిసెంబర్ 21న జరిగాయి.
40 ఓట్ల మెజారిటీతో..(Wrestling Federation of India)
అధ్యక్షుడు, కోశాధికారి, సెక్రటరీ జనరల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సహా 15 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవికి మాజీ కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అనితా షియోరాన్ మరియు ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ మధ్య పోటీ జరిగింది.హర్యానా కు చెందిన అనితా షియోరాన్ ఒడిశా నుంచి జాతీయ రెజ్లింగ్ సంస్థ అధ్యక్షపదవికి పోటీ పడ్డారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సాక్షి మాలిక్, బజరంగ్ పునియా మరియు వినేష్ ఫోగట్‌ల మద్దతు ఆమెకు ఉంది. 47 ఓట్లలో సంజయ్ సింగ్‌కు 40 ఓట్లు పోలయ్యాయి. యూపీ రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సంజయ్ 2019 నుంచి జాతీయ సమాఖ్య సంయుక్త కార్యదర్శిగా కూడా ఉన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అత్యున్నత పదవులకు జరిగే ఎన్నిక ప్రపంచ రెజ్లింగ్ సంస్థ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) డబ్ల్యుఎఫ్ఐ పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడానికి మార్గం సుగమం చేస్తుంది. యుడబ్ల్యుడబ్ల్యు ఆగస్ట్‌లో నిర్దేశించిన గడువుతో ఎన్నికలను నిర్వహించడంలో విఫలమైనందుకు డబ్ల్యుఎఫ్ఐ ని సస్పెండ్ చేసింది. దీనితో గత కొన్ని నెలలుగా ప్రపంచ ఈవెంట్‌లలో భారత రెజ్లర్లు తటస్థ క్రీడాకారులుగా పోటీ పడ్డారు.