Road Accident : మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్వాలియర్ నుంచి తికమ్‌గఢ్‌కు వెళ్తున్న మినీ ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వారంతా మినీ ట్రక్కులో వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది.
దతియా లోని దుర్సాదా పోలీస్ స్టేషన్ పరిధిలో బుహ్రా నదిలో ఈ రోజు ఉదయం మినీ ట్రక్కు పడిపోయింది. ఈ ట్రక్కులోని వారు.. వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. మినీ ట్రక్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. బుహ్రా నదిలో ట్రక్కు పడిపోయిందనే సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు అక్కడికి చేరుకుని ట్రక్కులోని వారిని రక్షించే ప్రయత్నం ప్రారంభించారు. ప్రస్తుతం నదిలో పడిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో వాహనంలో 25 నుంచి 30 మంది వరకు ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు ఆచూకీ తెలియడం లేదని.. ఎస్‌డీఆర్ఎఫ్ బృందం ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతుందని స్థానిక అధికారులు తెలిపారు.