Rahul Vs Rss: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మరోసారి పరువు నష్టం కేసు నమోదైంది. రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త పరువు నష్టం దావా వేశారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కోర్టులో ఈ కేసు నమోదు అయింది. జోడో యాత్రలో భాగంగా జనవరి 9 న హర్యాణాలోని అంబాలా జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కౌరవులతో పోల్చారని కమల్ బదౌరియా అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆరోపించారు. సదరు వ్యాఖ్యలకు గానూ పరువు నష్టం దావా వేసినట్టు ఆయన తెలిపారు.
రాహుల్ ఏమన్నారంటే..(Rahul Vs RSS)
జనవరి 9న అంబాలా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలంతా 21 వ శతాబ్ధపు కౌరవులని వ్యాఖ్యానించారు. ‘ కౌరవులు ఎవరు? 21 వ శతాబ్ధంలో కౌరవులు ఎలా ఉంటారంటే.. ఖాకీ ప్యాంటులు వేసుకుని ఉంటారు. షూ వేసుకుని , చేతిలో లాఠీ పట్టుకుంటారు. దేశంలోని కొంతమంది సంపన్నులు వారికి సపోర్టుగా ఉంటారు.’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా, తాజాగా వేసిన పరువు నష్టం దావా కేసుపై ఏప్రిల్ 12 న హరిద్వార్ కోర్టు విచారణ చేపట్టనుంది.
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరీ ఇంటి పేరు మోదీయో ఎందుకుంటుందో’ అని రాహుల్ వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా నిర్ధారించింది. ఈ క్రమంలో రెండేళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన నైపధ్యంలో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
తీర్పు వెలువడిన నాటి నుంచి (మార్చి 23వ తేదీ) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే, అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొంది. కానీ లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ అనర్హుడవుతారు.