Rahul Press Meet: రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. అనర్హత వేటు అనంతరం ఆయన తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అదానీ ల మధ్య స్నేహం గురించి పార్లమెంట్ లో మాట్లాడానని తెలిపారు. అదానీ గ్రూప్ కు చెందని షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది ఎవరు అని ఆయన రాహుల్ ప్రశ్నించారు. అదానీ వ్యవహారంలో ఆధారాలను తాను పార్లమెంట్ లో అందజేసినట్టు తెలిపారు. తన బ్రిటన్ పర్యటన గురించి కేంద్ర మంత్రులు పార్లమెంట్ లో అబద్ధాలు చెప్పారన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నపుటి నుంచే ఆయనకు అదానీతో సంబంధాలున్నాయని విమర్శించారు. లోక్ సభలో తన ప్రసంగాన్ని కేంద్రప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే తొలిగించిదన్నారు. అన్ని నిబంధనలను ఉల్లంఘించిన అదానీకి ఎయిర్ పోర్టులు కట్టబెట్టారని మండిపడ్డారు.
అదానీ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరివి(Rahul Press Meet)
అదానీ డొల్ల కంపెనీల్లో రూ. 20 వేల కోట్లుపెట్టుబడులు ఎవరు పెట్టారో తెలిపాలన్నారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. అదానీ వ్యవహారంలో స్పీకర్ కు అన్ని ఆధారాలను సమర్పించాను. లండన్ పర్యటన పై మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు. స్పీకర్ ను కలిసి మాట్లాడేందుకు నాకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారు. నేను ఎవ్వరికీ భయపడను. నాపై అనర్హత వేటు వేసినా .. జైలుకు పంపినా తగ్గేదేలే.. ఆటంకాలు సృష్టించినా వెనకడుగు వేసేది లేదు. నాకు జైలు శిక్షా వేస్తారా? ఐ డోంట్ కేర్. నిజం మాట్లాడటం తప్ప నాకు మరో మార్గం లేదు. నా పేరు సావర్కర్ కాదు.. గాంధీ..! క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా అంతా జరుగుతోంది. ప్రజల్లోకి వెళ్లడం ఒక్కడే ఇపుడు విపక్షాలకు ఉన్న ఒకే ఒక్క అవకాశం’ అని రాహుల్ పేర్కొన్నారు.
ఆరోజు మోదీ కళ్లల్లో భయం
‘ఈ రోజు దేశమంటే అదానీ.. అదానీ అంటే దేశంలా తయారు చేశారు. అదానీపై నా ప్రసంగాన్ని చూసి మోదీ ఆ రోజు భయపడ్డారు. ఆయన కళ్లల్లో భయాన్ని చూశాను. తర్వాత నేను లోక్‌సభలో మరోసారి ప్రసంగిస్తే ఇంకెన్ని నిజాలు బయటపెడుతానేమో అని ఆందోళన చెందారు. అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారు. నేను ఓబీసీ అని, దేశ వ్యతిరేకి అంటూ అసలు అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో ప్రతిపక్షాలకు వ్యవస్థల మద్దతు లేదని రాహుల్ అన్నారు. కేవలం ప్రజల మద్దతుతోనే విపక్షాలు పోరాటం చేస్తున్నాయన్నారు. అనర్హత విషయంలో తనకు అండగా నిలిచిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు.