Manipur Violence: గత నెలరోజులుగా మణిపూర్ రాష్ట్రం హింసాత్మక ఘటనలతో అతలాకుతలమవుతుంది. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈనెల 29,30 తేదీల్లో రాహుల్ మణిపూర్‌లో పర్యటిస్తారని, మృతులు క్షతగాత్రుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అంతే కాకుండా అక్కడ సహాయ పునరావాస కేంద్రాల్లో అవస్థలు పడుతున్న స్థానికులను పరామర్శిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు.
ఇంఫాల్, చురచంద్‌పుర్‌లలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను రాహుల్ గాంధీ సందర్శించి అక్కడ పౌరసమాజ ప్రతినిధులతో చర్చిస్తారని వేణుగోపాల్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. మణిపూర్‌లో దాదాపు రెండు నెలలుగా అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. సమాజం ఈ ఘర్షణల నుంచి శాంతివైపు వెళ్లడానికి ఒక స్వస్థత అవసరం. ఇది మానవతా విషాదం, ద్వేషం కాకుండా ప్రేమ యొక్క శక్తిగా ఉండటం మన బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు.
ఆగని అల్లర్లు(Manipur Violence)
ఇదిలా ఉంటే మణిపూర్‌లో చెలరేగుతున్న హింసాత్మక ఘటనల వల్ల దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు మూడువేల మందికిపైగా గాయపడ్డారు. మణిపూర్‌లో అల్లర్లను అణివేసేందుకు ఆర్మీసైతం రంగంలోకి దిగగా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. మరోవైపు హోంమంత్రి అమిత్ షా పర్యటించి ఈశాన్య రాష్ట్రంలో శాంతిని తిరిగి తీసుకొచ్చేందుకు పలు వర్గాల ప్రతినిధులను కలిశారు.
హోంమంత్రి ఆదేశాల మేరకు మణిపూర్‌లోని నిర్వాసితులకు 101.75 కోట్లు సహాయ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. హింసాత్మక ఘర్షణల కారణంగా స్థానిక ప్రజలకు ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి వసతి సౌకర్యాలు కల్పించింది.