Site icon Prime9

Rahul Gandhi: అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్‌ గాంధీ

rahul

rahul

Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ లో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో జైలు శిక్షపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో అనర్హత వేటు కొనసాగుతుండటంతో.. బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది.

లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ శనివారం నాడు అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. గత రెండు దశాబ్దాలుగా రాహుల్ గాంధీ 12- తుగ్లక్‌ లేన్‌ బంగ్లాలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే.. తనకు సంబంధించిన కొన్ని వస్తువులను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలించారు. సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10 జన్‌పథ్‌కు వస్తువులను పంపించారు. ఈ క్రమంలోనే ఈ మధ్యాహ్నం సోదరి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్‌ తన నివాసానికి వెళ్లారు. మిగతా వస్తువులను తీసుకుని బంగ్లా తాళాలను లోక్‌సభ సెక్రటేరియట్‌కు అప్పగించారు. ఇకపై రాహుల్‌ తన తల్లితో కలిసి జన్‌పథ్‌లో ఉండనున్నారు.

ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రాహుల్ కి మద్దతుగా నిలుస్తున్నారు. నా నివాసమే మీ నివాసం అనే హ్యష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ఈ దేశమే రాహుల్‌ గాంధీకి ఇల్లు.. ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు అని మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. నిబంధనల ప్రకారం.. అనర్హత వేటు పడిన సభ్యులు అధికారిక నివాసాన్ని నెల రోజుల్లోగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 12- తుగ్లక్‌లేన్‌లోని అధికార బంగ్లాను ఏప్రిల్‌ 22లోగా ఖాళీ చేయాలంటూ రాహుల్‌కు లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ఆయన తన అధికారిక నివాసాన్ని వీడారు.

Exit mobile version