Rahul Gandhi Stage Collapse: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌గాంధీకి బిహార్ ఎన్నికల ర్యాలీలో చేదు అనుభవం ఎదురైంది. బిహార్‌లోని పాలీగంజ్‌లో సోమవారం ఇండియా కూటమి ర్యాలీలో స్టేజ్‌లో కొంత భాగం కూలింది. కాగా స్టేజీపై రాహుల్‌గాంధీతో పాటు రాష్ర్టీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఉన్నారు.
బిహార్ నగర శివార్లలో పాలీగంజ్ నుంచి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి పోటీ చేస్తున్నారు. ఆమె మద్దతుగా ప్రచారం చేయడానికి రాహుల్ వచ్చారు. కాగా స్టేజీపై రాహుల్ కోసం ఏర్పాటు చేసిన సీటు వద్దకు మీసా భారతి తీసుకువస్తున్న సమయంలో స్టేజీ కూలింది. కాగా రాహుల్ బ్యాలెన్స్ తప్పి పడబోతున్న సమయంలో మీసా భారతి వెంటనే స్పందించి రాహుల్ చేతిని లాగి ఆయన పడకుండా కాపాడారు. వెంటనే రాహుల్ భద్రతా సిబ్బంది వచ్చారు. మొత్తానికి రాహుల్ మాత్రం ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకుని సురక్షితంగా బటయపడ్డారు.
సైనికులను కూలీలుగా చేసారు..(Rahul Gandhi Stage Collapse)
బిహార్‌లో రాహుల్ స్టేజీ కూలిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఎలక్షన్ ర్యాలీలో రాహుల్ గాంధీ… తన ప్రసంగంలో ఇండియా కూటమిని అధికారంలోకి తెస్తే.. అగ్నిపత్ స్కీంను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి నెల ప్రతి మహిళ ఖాతాలో రూ.8,500 డిపాజిట్ చేస్తామన్నారు. పనిలో పనిగా ప్రధానమంత్రి మోదీపై విమర్శలు గుప్పించారు. సైనికులను కూలీలుగా చేశారని విమర్శించారు. కేంద్రం అగ్నివీర్‌లను రెండు కేటగిరిలుగా విభజించింది. ఒక వేళ అగ్ని వీర్‌కు గాయాలైనా.. లేదా వీర మరణం పొందినా.. వీరమరణం హోదా దక్కదు. అలాగే ఎలాంటి పరిహారం లభించదు. ఎందుకు ఈ తారతమ్యం అని రాహుల్ మోదీని ప్రశ్నించారు.
ఇక ప్రధాని మోదీ సుమారు రూ.16 లక్షల కోట్లను తన బిలియనీర్ మిత్రుల బ్యాంకు రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. దీన్ని దేశ ప్రజలు ఎప్పుడూ క్షమించరని అన్నారు. పేద ప్రజల డబ్బు లాక్కొని తన కార్పొరేట్ మిత్రులకు పంచుతున్నాడు. వారు ఈ డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారన్నారు రాహుల్. ఇక వేళ జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఇప్పటికే మూతపడని పరిశ్రమలను తెరిపించి ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.