Rahul Gandhi Sensational Comments On Union Budget 2025: బడ్డెట్ మీద రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశం.. విపక్షాల తీరుతో గందరగోళంగా మారింది. ఉదయం సభ సమావేశం కాగానే, కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు ప్రధాన విపక్షమైన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చర్చకు పట్టుబట్టటంతో బాటు సభలో పలు అంశాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధానికి దారితీశాయి.
మరణాలను దాస్తున్నారు..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి వివరాలను ప్రభుత్వం ప్రకటించాలని కాంగ్రెస్ సోమవారం ఉదయం పట్టుబట్టింది. ఈ ఘటనలో యూపీలోని యోగి సర్కారు నిర్లక్ష్యం ఉందని, మరణాల సంఖ్యను తగ్గించి చూపుతున్నారంటూ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియాకూటమి ఎంపీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవటంతో, విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కాగా సభకు ఆటంకం కలిగించడం పట్ల స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీలకు సభను సజావుగా నిర్వహించడం ఇష్టం లేదని, అందుకే తొక్కిసలాట అంశాన్ని లేవనెత్తారంటూ ఆయన అసహనం వ్యక్తంచేశారు. స్వల్ప విరామం తర్వాత లోక్‌సభ మళ్లీ సమావేశమైంది.
సర్కారు వైఫల్యాలపై ఫైర్
దేశంలో నిరుద్యోగ సమస్యను ఎన్డీయే ప్రభుత్వం నియంత్రించలేకపోయిందని రాహుల్ ఆరోపించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఆశించినంత ఉద్యోగాలు సృష్టించలేదని వ్యాఖ్యానిస్తూనే, ఆ బాటనే ఎన్డీయే పయనిస్తోందని వ్యాఖ్యానించారు. భారత్ ఉత్పత్తి ఆధారిత దేశంగా విఫలమైందని, దీనివల్ల చైనా అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా అవతరించిందని, ఇకనైనా భారత్ ఉత్పత్తి పై ఫోకస్ పెంచాలని సూచించారు. మేకిన్ ఇండియా మంచి ఆలోచనే అయినా మోదీ దాన్ని సక్సెస్ చేయలేకపోయారన్నారు.
విదేశాంగ విధానం
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం వచ్చేలా తెరవెనక కథ నడిపేందుకే.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను.. మోదీ ముందుగా అమెరికా పంపారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మన ఆర్థిక విధానాలు, పాలన బాగుంటే.. ఆహ్వానాలు అవే వస్తాయని, ఇలా తిప్పలు పడాల్సిన పనిలేదంటూ కేంద్రంపై సెటైర్లు వేశారు. గతంలో తాము అధికారంలో ఉండగా పనిచేసి ఉండుంటే.. అమెరికా అధ్యక్షుడే స్వయంగా వచ్చి ప్రధానిని ఆహ్వానించేవారని ఎద్దేవా చేశారు. లడఖ్‌లో చైనా సైన్యం చొరబాటు గురించి ప్రధాని చేసిన వాదనలకి విరుద్ధంగా భారత సైన్యం వాదలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. విపక్ష నాయకుడు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, విదేశాంగ విధానంపై మాట్లాడేటప్పుడు విపక్ష నేత సంయమనం పాటించాలని హితవు పలికారు.
కులగణన చేయాల్సిందే: రాహుల్
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్‌గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో 90 శాతం జనాభా ఉన్న ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు హక్కులు దక్కడం లేదని చెబుతూ.. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కులగణన గురించి ప్రస్తావించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం చేసిన కులగణనలో 90 శాతం జనాభా ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలున్నట్లు తేలిందన్నారు. బీజేపీ ఎంపీలలో సగంమంది ఓబీసీలే అయినా, వారికి మాట్లాడే స్వేచ్ఛ లేదని రాహుల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కులగణన చేస్తేనే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందని, ఇకనైనా కేంద్రం దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, గత నెల 29న మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటను నిరోధించడంలో యోగి సర్కార్ విఫలమైందంటూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశారు. ఈ ఘటనలో దురదృష్టకరమని, ఇందులో నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, ఘటనకు బాధ్యులైన యూపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో కోర్టు కలగజేసుకుని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ పిల్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇది దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంటూనే, అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్ విశాల్ తివారీకి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సూచించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు.
ముగిసిన ప్రచారం
కాగా, సోమవారం సాయంత్రంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం అంటే.. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం ప్రారంభం కానుండటంతో సుమారుగా 3 నెలల నుంచి ప్రచారంలో బిజీబిజీగా సాగిన పార్టీల నేతలంతా పోలింగ్ మీద ఫోకస్ పెంచారు. ఫిబ్రవరి 5న పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపై ఈసీ నిషేధం విధించింది. పోలింగ్ రోజు ఒపీనియన్ పోల్ వివరాలను గానీ, ఇతర పోల్ సర్వేల వివరాలను ప్రచురించడానికి, ప్రదర్శించడానికి వీల్లేదని తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి, తమిళనాడులోని ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది.