Rahul Gandhi New passport: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కొత్త సాధారణ పాస్‌పోర్ట్‌ను అందుకున్నారు,గాంధీకి ఆదివారం పాస్‌పోర్టు మంజూరు చేస్తామని పాస్‌పోర్ట్ కార్యాలయం హామీ ఇచ్చిందని, మధ్యాహ్నం దానిని పొందారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాహుల్ అమెరికాలో మూడు నగరాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.
అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ..(Rahul Gandhi New passport)
రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లనున్నారు, అక్కడ ఆయన తన మూడు నగరాల పర్యటనను ప్రారంభిస్తారు. శాన్ ఫ్రాన్సిస్కోతో తన పర్యటనను ప్రారంభించే రాహుల్ గాంధీ అక్కడ ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సంభాషించబోతున్నారు. అక్కడ విలేకరుల సమావేశంలోకూడా ప్రసంగిస్తారు. వాషింగ్టన్ డిసి లోని చట్టసభ సభ్యులు మరియు థింక్ ట్యాంక్‌లతో సమావేశాలు నిర్వహిస్తారు. రాహుల్ తన వారం రోజుల పర్యటనలో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి, చట్టసభ సభ్యులను కలుసుకునే అవకాశం ఉంది. థింక్ ట్యాంక్‌ల సభ్యులు, వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్‌లు మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులతో సంభాషించే అవకాశం ఉంది. జూన్ 4న న్యూయార్క్‌లో భారీ బహిరంగ సభతో ఆయన పర్యటనను ముగించబోతున్నారు.
స్వామి ఫిర్యాదుతోనే..
రాహుల్ గాంధీ కొత్త పాస్‌పోర్ట్ 3 సంవత్సరాలు పాటు చెల్లుబాటు అవుతుంది.తాను పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు జారీ చేసిన పాత డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసి సాధారణ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీ మోదీ ఇంటిపేరు వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ పై ఎంపీగా అనర్హత వేటు పడింది. బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి లేవనెత్తిన అభ్యంతరం నేపథ్యంలో, రాహుల్ గాంధీకి ‘సాధారణ పాస్‌పోర్ట్’ను సాధారణంగా జారీ చేసే 10 సంవత్సరాలకు బదులుగా మూడేళ్లపాటు జారీ చేయడానికి ఢిల్లీ కోర్టు శుక్రవారం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది.