Rahul Gandhi Meets Hathras Victims: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాటలో మరణించిన బాధితుల కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు.హత్రాస్ పర్యటనకు ముందు అలీఘర్‌లోని పిలాఖ్నా గ్రామంలో ఆగి, అక్కడ కూడా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, నేను ఈ విషయాన్ని రాజకీయం చేయదలచుకోలేదు, అయితే, కొంత నిర్లక్ష్యం ఉంది. దీనిపై విచారణ జరపాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వ్యక్తులు పరిహారం పొందాలని అన్నారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు సత్సంగ నిర్వాహకులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అలీఘర్ ఐజి శలభ్ మాథుర్ మాట్లాడుతూ వీరందరూ ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులు. సేవదార్లు’గా పనిచేశారని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవతోపాటు మరో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో యోగి ఆదిత్యనాథ్ న్యాయ విచారణకు ఆదేశించారు. సత్సంగ్ నిర్వాహకుడు భోలే బాబా పరారీలో ఉన్నాడు.